- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
- రెండో స్థానానికి జైస్వాల్
దుబాయ్: భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు పడగొట్టిన బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన సంగతి తెలిసిందే.
పెర్త్ టెస్టుకు ముందు మూడో స్థానంలో ఉన్న బుమ్రా 883 కెరీర్ బెస్ట్ పాయింట్లతో తొలి స్థానానికి దూసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సఫారీ పేసర్ కగిసో రబాడ (872 పాయింట్లు), ఆసీస్ పేసర్ హాజిల్ వుడ్ (860 పాయింట్లు) రెండు, మూడు స్థానాలకు పడిపోయారు. ఇక సిరాజ్ ఐదు స్థానాలు ఎగబాకి 25వ స్థానంలో నిలిచాడు.
బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. పెర్త్ టెస్టులో భారీ సెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్ (825 పాయింట్లు) ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకుని తొలిసారి బెస్ట్ ర్యాంకు అందుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (903 పాయింట్లు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆసీస్‌తో తొలి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ తొమ్మిది స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. పంత్ (736 పాయింట్లు) తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ జాబితాలో రవీంద్ర జడేజా, అశ్విన్‌లు తమ తొలి రెండు స్థానాలను కాపాడుకున్నారు.