calender_icon.png 13 October, 2024 | 12:54 PM

తూప్రాన్ గురుకులంలో రౌడీయిజం

03-09-2024 04:07:24 AM

  1. 9వ తరగతి విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థుల దాడి 
  2. అర్థ్ధరాత్రి బ్యాట్లతో చితకబాదిన వైనం 
  3. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన తల్లిదండ్రులు

మెదక్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు రౌడీయిజాన్ని ప్రదర్శించారు. ఇటీవల 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థుల మధ్య సెంట్ బాటిల్ విషయమై వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి పదవ తరగతి విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులపై బ్యాట్‌లతో విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యా యి. బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం వారంతా పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ మురళిని నిలదీశారు. విద్యార్థులపై దాడి జరిగిన విషయాన్ని బయటకు చెప్పొద్దని తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ సముదాయించారు.

దాడికి పాల్పడిన 10మంది విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించివేస్తామని హామీనిచ్చారు. అయితే తూప్రాన్ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెండు నెలల క్రితం కళాశాల విద్యార్థులు ఇదే తరహాలో పదవ తరగతి విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. తాజాగా 9వ తరగతి విద్యార్థులపై దాడి జరగడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.