calender_icon.png 25 November, 2024 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుల్స్ స్వైర విహారం

23-11-2024 12:00:00 AM

  1. సెన్సెక్స్ 2,000 పాయింట్ల ర్యాలీ
  2. నిఫ్టీ 550 పాయింట్లు జంప్

ముంబై, నవంబర్ 22:  పలు ప్రతికూలాంశాలతో కొద్దిరోజులుగా తీవ్ర ఒడిదు డుకుల్లో చిక్కుకున్న మార్కెట్ పగ్గాల్ని బుల్స్ అనూహ్యంగా  చేజిక్కించుకుని పరుగులు తీయించారు. బుల్స్ తాకిడికి బేర్స్ వారి షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకుంటూ పెద్ద ర్యాలీకి కారణమయ్యారు.

ఇటు ఐటీ, టెక్నాలజీ షేర్లలో ఒకవైపు తాజా కొనుగోళ్లు, బ్యాంకింగ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో షార్ట్ కవరింగ్ కలిసికట్టుగా జరగడంతో శుక్రవారం మార్కెట్‌లో భారీ ర్యాలీ జరిగింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 2,062 పాయింట్లు ఎగిసి 79,218 పాయింట్లను తాకింది. చివరకు 1,961 పాయింట్ల భారీలాభంతో 79,000 పాయింట్ల ఎగువన 79,117 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 600 పాయింట్ల మేర పెరిగి 23,956 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన అనంతరం చివరకు 557 పాయింట్ల నష్టంతో కీలకమైన 23,800 పాయింట్ల ఎగువన 23,907 పాయింట్ల వద్ద ముగిసింది.

దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్ల జోరు, యూఎస్ మార్కెట్ల సానుకూల ట్రెండ్ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చిందని ట్రేడర్లు తెలిపారు. బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 2,446 షేర్లు లాభపడగా, 1,475 షేర్లు తగ్గాయి. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,536 పాయింట్లు, నిఫ్టీ 374 పాయింట్ల చొప్పున పెరిగాయి. 

సెన్సెక్స్‌లోకి జొమాటో

బీఎస్‌ఈ ప్రధాన సూచి సెన్సెక్స్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్థానంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్రవేశిస్తుంది. ఈ డిసెంబర్ 23 నుంచి మార్పు అమలులోకి వస్తుందని బీఎస్‌ఈ తెలిపింది. 

స్వల్పంగా కోలుకున్న అదానీ గ్రూప్ 6 కంపెనీల షేర్లు

  1. క్షీణించిన నాలుగు కంపెనీలు

న్యూయార్క్ కోర్టు గౌతమ్ అదానీపై అరెస్టు వారెంట్ జారీచేయడంతో గురువారం నిలువునా పతనమైన అదానీ గ్రూప్ షేర్లు శుక్రవారంనాటి మార్కెట్ ర్యాలీలో పెద్దగా పాల్గొనలేదు. ఆరు అదానీ గ్రూప్ షేర్లు స్వల్పంగా కోలుకోగా, మరో నాలుగు మరింతగా నష్టపోయాయి. క్రితం రోజు 23 శాతం పడిపోయిన గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 2.16 శాతం రికవరయ్యింది.

అంబూజా సిమెంట్స్ 3.5 శాతం, ఏసీసీ 3.17 శాతం, అదానీ పోర్ట్స్ 2 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 1.18 శాతం, ఎన్‌డీటీవీ 0.65 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు అదానీ గ్రీన్ ఎనర్జీ మరో 8.20 శాతం పతనమయ్యింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 6.92 శాతం, అదానీ పవర్ 3.23 శాతం, అదానీ విల్మార్ 0.73 శాతం చొప్పున తగ్గాయి. 

ఎస్బీఐ, టీసీఎస్ టాపర్స్

సెన్సెక్స్-30 బాస్కెట్‌లో అన్ని షేర్లూ గ్రీన్‌లో ముగియడం విశేషం. అన్నింటికంటే అధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు 4 శాతం పెరిగాయి. టైటాన్, ఐటీసీ, ఇన్ఫోసిస్, లార్సన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్‌లు 3 శాతం వరకూ లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు పెరగ్గా, ఐటీ ఇండెక్స్ అధికంగా 3.26 శాతం ర్యాలీ జరిపింది.

టెక్నాలజీ ఇండెక్స్ 3.18 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.36 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 2.19 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 2.18 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 2.17 శాతం పెరిగింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.26 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.90 శాతం చొప్పున లాభపడ్డాయి.

రూ.7.32 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

మార్కెట్ భారీ ర్యాలీతో శుక్రవారం ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.7.32 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.7,32.144 కోట్లు పెరిగి రూ.4,32,71,052 కోట్లకు (5.12 బిలియన్ డాలర్లు) చేరింది.