- సెన్సెక్స్ 1,436 పాయింట్లు జంప్
24,200 పాయింట్లపైకి నిఫ్టీ
ముంబై, జనవరి 2: కొత్త ఏడాది తొలిరోజున స్టాక్ మార్కెట్‌కు శుభారంభాన్ని ఇచ్చిన బుల్స్ రెండో రోజైన గురువారం స్వైర విహారం చేశారు. బేర్స్ తాకిడికి కొద్దివారాలు విలవిలలాడుతున్న బుల్స్ ఒక్క ఉదుటన భారీ కొనుగోళ్లు జరిపారు. దీనితో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,525 పాయింట్లు జంప్‌చేసి 80,000 పాయింట్లస్థాయిని దాటింది. చివరకు 1,436 పాయింట్ల భారీలాభంతో 79,943 పాయింట్ల వద్ద నిలిచింది.
నెలరోజుల అనంతరం ఒక్కరోజులో సెన్సెక్స్ ఇంత భారీగా పెరగడం ఇదే ప్రధమం. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 24,200 పాయింట్ల పైన 24,226 పాయింట్ల గరిష్ఠతాకిన అనంతరం చివరకు 445 పాయింట్లు లాభపడి 24,188 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫైనాన్షియల్, ఆటోమొబైల్, ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయని విశ్లేషకులు తెలిపారు. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,345 స్టాక్స్ పెరగ్గా, 1,574 స్టాక్స్ తగ్గాయి.
షార్ట్ కవరింగ్ ర్యాలీ
ఒకవైపు బుల్స్ కొనుగోళ్లు, మరోవైపు బేర్స్ షార్ట్ కవరింగ్‌తో వేగవంతమైన ర్యాలీ జరిగిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. వచ్చేవారం ప్రారంభంకానున్న క్యూ3 ఫలితాల సీజన్ పట్ల ఆశాభావంతో మార్కెట్లో మూమెంటం ఏర్పడిందని, ర్యాలీ విస్త్రతంగా జరగడంతో అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. డిసెంబర్ నెలలో వాహన విక్రయాలు పెరిగినట్లు గణాంకాలు వెలువడంతో తాజా ర్యాలీకి ఆటో రంగం నేతృత్వం వహించిందని, ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలతో బ్యాంకింగ్, ఐటీ షేర్లు కూడా మంచి ప్రదర్శన కనపర్చాయని వివరించారు.
బజాజ్ ఫిన్‌సర్వ్ టాపర్
సెన్సెక్స్ ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫిన్‌సర్వ్ 8 శాతం ఎగిసింది. బజాజ్ ఫైనాన్స్ 6 శాతం పెరిగింది. మారుతి సుజుకి షేరు 6 శాతం ర్యాలీ జరిపింది. ఈ షేరు వరుస రెండు రోజుల్లో 9 శాతంపైగా లాభపడింది. ఇదేరీతిలో మహీంద్రా అండ్ మహీంద్రా 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 3,228 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయిని నమోదుచేసింది. టైటాన్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జొమాటో, అల్ట్రాటెక్ సిమెంట్, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లు 3.5 శాతం వరకూ పెరిగాయి. సన్‌ఫార్మా ఒక్కటే నష్టపోయింది.
కదంతొక్కిన ఆటో, ఐటీ సూచీలు
అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగియగా, అధికంగా ఆటోమొబైల్ ఇండెక్స్ 3.66 శాతం, ఐటీ ఇండెక్స్ 2.34 శాతం చొప్పున పెరిగాయి.కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 2.24 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 2.19 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 2.02 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.41 శాతం చొప్పున లాభపడ్డాయి. మెటల్, రియల్టీ సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.89 శాతం చొప్పున లాభపడ్డాయి.
కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌పీఐలు
వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్లలో భారీ అమ్మకాలకు పాల్పడిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. గురువారం ఎఫ్‌పీఐలు రూ.1,506 కోట్ల నికర పెట్టుబడులు పెట్టినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత వరుస నాలుగు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.9,000 కోట్లు వెనక్కు తీసుకున్నారు.
2 రోజుల్లో రూ.8.52 లక్షల కోట్లుపెరిగిన ఇన్వెస్టర్ల సంపద
కొత్త సంవత్సరంలో తొలి రెండు రోజుల్లో జరిగిన మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.8.52 లక్షల కోట్లు పెరిగింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 1,800 పాయింట్లకుపైగా పెరిగింది. ఫలితంగా బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.8,52,239 కోట్లు పెరిగి రూ.4,50,47,345 కోట్లకు (5.25 ట్రిలియన్ డాలర్లు) చేరింది.