calender_icon.png 28 October, 2024 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త శిఖరాలపైకి బుల్స్ పరుగు

28-06-2024 01:49:24 AM

న్యూఢిల్లీ, జూన్ 27: దుందుడుకు ర్యాలీని కొనసాగిస్తున్న బుల్స్ మరింత ఉన్నత శిఖరాలకు స్టాక్ సూచీలను చేర్చారు. చరిత్రలో తొలిసారిగా గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 79,000 పాయింట్లపైన పాగా వేసింది. ఈ సూచి రెండు రోజుల్లోనే రెండు అంగల్లో 78,000 శిఖరం నుంచి 79,000 శిఖరంపైకి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలిసారిగా 24,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది.  సెన్సెక్స్ బుధవారం మరో 569 పాయింట్లు పెరిగి 79, 243 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 722 పాయింట్లు పెరిగి 79,396 పాయింట్ల వద్ద కొత్త రికార్డుస్థాయిని నెలకొల్పింది. ఇదేబాటలో  ఇంట్రాడేలో 219 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ 24,087 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 175 పాయింట్లు లాభపడి కొత్త గరిష్ఠస్థాయి 24,044 పాయిం ట్ల వద్ద క్లోజయ్యింది. హెవీవెయిట్ షేర్లయిన ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు స్టాక్ సూచీలను కొత్త రికార్డుస్థాయిలవైపు పరుగులు తీయించాయి.  ఈ ఏడాది మే 24న నిఫ్టీ తొలిసారిగా 23,000 పాయింట్లను తాకగా, జూన్ 25న సెన్సెక్స్ 78,000 పాయింట్ల స్థాయిని అందుకుంది. 

షార్ట్ కవరింగ్

జూన్ డెరివేటివ్ కాంట్రాక్టులకు గురువారం ముగింపురోజైనందున, బ్లూచిప్ షేర్లలో పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరగడంతో మార్కెట్లో దూకుడు కొనసాగిందని విశ్లేషకులు తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లు వారి ఫేవరేట్ రంగాలైన బ్యాంకింగ్‌లో గత మూడు రోజులుగా షార్ట్స్ కవర్ చేశారని, తాజాగా ఐటీ షేర్లలో షార్ట్ పొజిషన్లను స్వేర్‌అప్ చేసుకున్నారని అనలిస్టులు వివరించారు. ఐటీ రంగం పునరుత్తేజమవుతుం దన్న అంచనాలు, సిమెంట్ పరిశ్రమలో జరుగుతున్న కన్సాలిడేషన్‌తో బుల్లిష్ మూమెంటం కొనసాగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. హెవీవెయిట్స్ పెరిగినప్పటికీ, మెజారిటీ షేర్లు సైడ్‌వేస్‌లోనే ఉన్నాయ న్నారు. లార్జ్‌క్యాప్ షేర్లు ర్యాలీతో దేశీయ మార్కెట్ సరికొత్త గరిష్ఠానికి చేరిందని లార్జ్‌క్యాప్స్ విలువలు సరైనవిగా ఉన్నందున వాటిలో కొనుగోళ్లు జరిగాయని, వాటికి భిన్నంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ అధిక విలువలతో ఉన్నాయన్న భావనతో వాటిలో లాభాల స్వీకరణ జరిగిందని వివరించారు. 

ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం క్యాష్ మార్కెట్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపారు. ఎఫ్‌పీఐలు తాజాగా  రూ.7,658 కోట్ల నిధుల్ని పెట్టుబడి చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బుధవారం వీరు రూ.3,535 కోట్లు వెనక్కు తీసుకున్నారు. 

  • సెన్సెక్స్@79,000
  • నిఫ్టీ@24,000

సిమెంట్ షేర్ల జోరు

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా అల్ట్రాటెక్ సిమెంట్ అత్యధికంగా 5 శాతంపైగా పెరిగింది. ఇండియా సిమెంట్స్‌లో 23 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈ షేరు ర్యాలీ జరిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా రెండో రోజు పెరిగి మరో కొత్త రికార్డుస్థాయి రూ.3,060 వద్దకు చేరింది. భారతి ఎయిర్‌టెల్ సైతం ఇదేబాటలో రూ.1,480 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రాలు 2 శాతం మధ్య లాభపడ్డాయి. 

మరోవైపు లార్సన్ అండ్ టుబ్రో, సన్‌ఫార్మా, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతిలు నష్టాల్లో ముగిసాయి. వివిధ రంగాల సూచీల్లో పవర్ ఇండెక్స్ అధికంగా 1.74 శాతం పెరిగింది. ఐటీ ఇండెక్స్ 1.65 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 1.59 శాతం చొప్పున పెరిగాయి. యుటిలిటీస్ ఇండెక్స్ 1.29 శాతం, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్  1.18 శాతం, కమోడిటీస్ సూచి 0.82 శాతం, ఆటోమొబైల్ సూచి 0.70 శాతం చొప్పున పెరిగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ట్రియల్స్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు నష్టపోయాయి.  బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచి 0.57  శాతం తగ్గింది.

రూ.438 లక్షల కోట్లకు మార్కెట్ విలువ

ఈ వారం జరిగిన నాన్‌బె ర్యాలీతో భారత స్టాక్ మార్కెట్ విలువ రూ.438.41 లక్షల కోట్ల కొత్త రికార్డుస్థాయికి చేరింది. సెన్సెక్స్ 79,000 పాయింట్లను దాటిన సందర్భంగా బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,38,41,960.73 కోట్లకు (5.25 ట్రిలియన్ డాలర్లు) చేరింది. ఈ వారం నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.3.93 లక్షల కోట్ల మేర పెరిగింది.