జనగామలో అరవైఏండ్లుగా కొనసాగుతున్న ఆచారం
హుస్నాబాద్, జనవరి 15 : తరాలు మారుతున్నా ఆ ఊరులో ఒక ఆచారం కొనసాగుతూనే ఉంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామలో అరవై ఏండ్లుగా కొత్తకొండ జాతరకు ఎడ్లబండ్లు కడుతూనే ఉన్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి హుస్నాబాద్ నియోజకవర్గంలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ ఈరన్న(వీరభద్రస్వామి) జాతరకు ఎడ్లబండ్లతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఈసారి కూడా పెద్ద ఎత్తున ఎడ్లబండ్లు కట్టుకొని తరలివెళ్లారు. సంక్రాంతికి నెలరోజుల ముందు ఆ ఊరుకు చెందిన కాసర్ల కొత్తకొండ ఆయన కొడుకు శ్రవణ్ కుమార్ ఉపవాసదీక్ష చేస్తారు. సంక్రాంతి పండుగ రాగానే ఊరోళ్లు కొత్తకొండ జాతరకు ఎడ్ల బండ్లను తయారు చేస్తారు. వాటిని డప్పు చప్పుళ్లతో ఊరంతా తిప్పారు.
కొత్తకొండ ఈరన్నకు ప్రతీకగా భావించే కొత్తకొండ ఆయన కొడుకు శ్రవణ్ కుమార్ ఈరన్న దండకాలు చదువుతూ ఖడ్గాలు ప్రదర్శించారు. అనంతరం ఎడ్లబండ్లపై గ్రామస్తులంతా కొత్తకొండ జాతరకు బయల్దేరి వెళ్తారు. ఈ వేడుక ఊళ్లో సంప్రదాయంగా మారింది. ఇందుకోసం ఊరోళ్లు ప్రత్యేకించి ఎడ్లు, కచ్రాలను కొనుగోలు చేస్తారు. జాతర కోసం వాటిని పదిలంగా కాపాడుకుంటారు.