మంబై, జనవరి 1: ఫెరారీ కారు కొన్ని సెకన్లలోనే 200 కి.మీ అందుకోగలదు. కళ్లు మూసి తెరిచే లోపు కంటికి అందని దూరం దూసుకెళ్లగలదు. రూ.4 కోట్ల ధర. అదిరేపోయే ఫీచర్స్. లగ్జరీకి లగ్జరీ. అయితేనేమీ.. ‘అలవి గాని చోట అధికులమని అనరాదు’ అన్నట్లు కారుకు కూడా ఆ పరిస్థితి వచ్చింది. ఔత్సాహికులు బీచ్‌లో సవారీ చేస్తుండగా కారు ఇసుకలో ఇరుక్కుపోయింది.
ముంబైకి చెందిన ఓ వ్యక్తి మంగళవారం తన లగ్జరీ కారులో స్నేహితులతో కలిసి రాయ్‌గఢ్ సమీపంలోని రేవ్‌దండా బీచ్‌కు వచ్చాడు. బీచ్‌లో విహరిస్తుండగా కారు ఇసుకలో ఇరుక్కుపోయింది. చుట్టుపక్కల ఉన్న సందర్శకులంతా కారు వద్దకు వచ్చి బయటకు నెట్టే ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ కారు ముందుకు కదల్లేదు. చివరకు యజమాని ఎడ్లబండి సాయంతో అతికష్టం మీద కారును బయటకు తీసుకురాగలిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.