calender_icon.png 2 October, 2024 | 5:56 AM

మాటల తూటాలు

02-10-2024 03:16:43 AM

కేటీఆర్ x కోమటిరెడ్డి

మూసీ మే లూటో ఢిల్లీమే బాంటో

ఆర్‌బీఎక్స్ అంటే రేవంత్‌రెడ్డి బుల్డోజర్ !   

  1. గోడలపై ఆర్‌బీఎక్స్ తుడిచి కేసీఆర్ అని రాసుకోండి
  2. మూసీ నిర్వాసితుల కోర్టు ఖర్చులను బీఆర్‌ఎస్ భరిస్తుంది
  3. 55 కి.మీ. మూసీ ప్రక్షాళనకు రూ. లక్షా యాబైవేల కోట్లా ?
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : మూసీ మే లూటో.. ఢిల్లీమే బాంటో అనే రీతిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని ఇష్టమొచ్చిన తీరులో పెంచిందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్వేకు వచ్చిన అధికారులు పేదల ఇండ్ల గోడలపై ఆర్‌బీఎక్స్ అని రాస్తున్నారని, ఆర్‌బీఎక్స్ అంటే రేవంత్‌రెడ్డి బుల్డోజర్ అని  కేటీఆర్ అన్నారు. మంగళవారం అంబర్‌పేట, గోల్నాక, తులసీరామ్‌నగర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూసీ నిర్వాసితులకు బీఆర్‌ఎస్ భరోసా కార్యక్రమాన్ని నిర్వహిం చారు.

ఈ సందర్భంగా కేటీఆర్ కాలనీలో పర్యటించి బాధితులను పరామర్శించగా.. వారు ఆయనకు గోడు వెళ్లబోసుకున్నారు. ఏండ్ల తరబడి ఇక్కడే నివాసముం టున్నామని, ఎప్పుడూ మూసీ వరద తమ ఇండ్లలోకి రాలేదని వాపోయారు. ఇండ్లలో ఎవరూ లేని సందర్భంలో అధికారులు వచ్చి సర్వేల పేరిట తమ వివరాలు సేకరించారన్నారు.

నెల రోజులుగా కంటిలో కునుకులే కుండా ఉంటున్నామని చెప్పారు. ఈ  సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ పరి వాహక ప్రాంతంలో అధికారులు సర్వే నిర్వహించి ఆర్‌బీఎక్స్ అని రాస్తున్నారని, బాధి తులు దాన్ని తుడిపేసి కేసీఆర్ అని రాసుకోవాలని సూచించారు.

కేసీఆర్, బీఆర్‌ఎస్ బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్‌రెడ్డి తీరు మారలేదని, మంగళవారం కూడా శంకర్‌రావునగర్‌లో కూడా ఇండ్లు కూల్చారని ఆరోపించారు. మూసీ నిర్వాసితు కోర్టు ఖర్చులను బీఆర్‌ఎస్ పార్టీ భరిస్తుందని చెప్పారు. 

ఇందిరమ్మ చెప్పిందా.. సోనియమ్మ చెప్పిందా..

గరీబోళ్ల ఇండ్లు కూల్చమని రేవంత్‌రెడ్డికి ఇందిరమ్మ చెప్పిందా.. సోనియమ్మ చెప్పిందా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోనే పెద్ద పండుగ అయిన బతుకమ్మ, దసరాకు కూడా రేవంత్‌రెడ్డి పేదలకు సుఖంలేకుండా చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడు బుల్డోజర్లు పంపుతాడోనని పేదలు భయపడుతున్నారన్నారు.

అడ్డి మారి గుడ్డిలో సీఎం అయిన రేవంత్‌రెడ్డి పేదలపై పగబట్టారని విమర్శించారు. ప్రస్తుతం 28వేలు మంది ఖాళీ చేయిస్తున్నామని చెప్తున్నా, లోపల లెక్కలు వేరే ఉన్నాయని ఆరోపించారు. 

వందరోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలయిన గృహిణులకు రూ.2500, రూ.4వేల పెన్షన్, రుణమాఫీలను అమలు చేయాలని, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. పేదలను ఆదుకోవడానికి కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూంలు కట్టారని, రేవంత్ దానికి రెట్టింపు కట్టాలి కానీ పేదల జోలకి పోవద్దని సూచించారు. 

గంగానది ప్రక్షాళనకు 2,400 కి.మీలకు 20వేల కోట్లే

గంగానది ప్రక్షాళనకు ప్రధాని నరేంద్రమోదీ 2400 కి.మీలకు రూ. 20వేల కోట్లు కేటాయించారని, కానీ 55కి.మీ మూసీ ప్రక్షాళనకు రేవంత్‌రెడ్డి రూ. లక్షాయాభైవేల కోట్లు కేటాయించారని విమర్శించారు. తమ హయాంలో మూసీ అభివృద్ధి కోసం రూ.16వేల కోట్లు కేటాయించామన్నారు. ఇప్పుడు దాన్ని రేవంత్‌రెడ్డి పదిరెట్లు పెంచారని విమర్శించారు. పేదలకు ఇబ్బందులు కలుగకుండా చూశామన్నారు.

నగరంలోని వందశాతం మురుగును శుద్ధి చేసేలా రూ.4వేల కోట్లతో ఎస్టీపీలను నిర్మించామని, హైలెవల్ బ్రిడ్జిలను ప్రతిపాదించా మని చెప్పారు. పెద్ద సార్లు చెప్పారని పోలీసులు గరీబుల మీద జులుం చేయొద్దని, ప్రభుత్వం శాశ్వతం కాదన్నారు.

హోంగార్డులకు కూడా నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలివ్వడంలేదని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో నగంరలో కాంగ్రెస్‌ను ప్రజలు జాడిచ్చి తన్నారని, ఇండ్లమీదకొస్తే తరిమికొడతారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్కడున్నారు, మూసీ బాధితులు కనిపించడంలేదా అన్నారు. 

అన్నీ పట్టా ఇండ్లే..: ఎమ్మెల్యే కాలేరు

అంబర్‌పేట తులసీనగర్‌లోని ఇండ్లన్నింటికీ పట్టాలున్నాయని, ఎవరూ కబ్జా చేసి కట్టలేదని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. రూ.ఐదు వేలు ఇచ్చి మాట్లాడిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారని, ఆయన నిర్వాసితుల వద్దకు వచ్చి తెలుసుకోవాలని సూచించారు. యాభై ఏండ్లు కాంగ్రెస్ పాలించిందని, ఈ కాలనీ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉందని ఎన్నడూ  అధికారులు రాలేదని, ఇప్పుడే ఎందుకు వస్తున్నారని విమర్శించారు.

సుందరీకరణ ఎలా చేస్తారు, డీపీఆర్‌లు సిద్ధం చేశారా అని ప్రశ్నించారు. అంబర్‌పేట్‌లో 3వేల ఇండ్లున్నట్లు అధికారులు చెబుతున్నారని, వారి ఇండ్లను కూల్చి స్టార్ హోటళ్లు కడుతారా అని ప్రశ్నించారు. 60, 70గంజాల్లోని ఇండ్లను కూల్చితే పేదల ఇండ్లు, జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేసీఆర్ పాలనలో ఇబ్బంది పెట్టలే: తలసాని శ్రీనివాస్‌యాదవ్

హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చేందుకు వస్తే అండగా ఉంటామని మాజీ మం త్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదలను ఇబ్బంది పెట్టలేదన్నారు. కాంగ్రెస్ వచ్చి తొమ్మిది నెలలు కాకముందే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయన్నారు.

కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్, సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్,  గండ్ర వెంకటరమనారెడ్డి, సురేందర్, బీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్, సోహెల్ పాల్గొన్నారు. 

7 లక్షల కోట్లు దోచుకుతిన్నారు

నల్లగొండపై కక్ష కట్టినట్టు చేస్తున్నారు 

  1. 10 ఏళ్లు అధికారంలో ఉండి మూసీ ఎందుకు క్లీన్ చేయలేదు? 
  2. మూసీ ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం 
  3. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కామన్ సెన్స్ లేదు 
  4. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజలు మూసీ కంపుతో చచ్చిపోతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. పొద్దున్న లేవగానే మురికి కూపం చూడాల్సి వస్తుందన్నారు. ముక్కు మూసుకోకుండా ఒక్క 10 నిమిషాల పాటు మూసీ ప్రాంతంలో ఉంటే, ప్రపంచంలోనే ఇంత వరస్ట్ రివర్ మరోటి లేదని అర్థమవుతుందని చెప్పారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లు అధి కారంలో ఉండి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీని ఎందుకు క్లీన్ చేయలేదని ప్రశ్నించారు. ‘మీ హయాంలోనే కదా.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మా పార్టీలో గెలిచిన వ్యక్తిని లాక్కొని క్యాబినెట్ ర్యాంక్ హోదా తో మూసీ కార్పొరేషన్‌కు చైర్మన్ చేశారు కదా.. నల్లగొండ ఉద్యమకారుల జిల్లా అయి నా... మాపై కక్ష గట్టినట్టుగా చేస్తున్నారు.

మూసీనీ శుద్ధి చేయాలని 25 ఏళ్ల క్రితమే నేను 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టా ను. ఈ దీక్షకు మద్దతుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ కూడా వచ్చారు. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఒక్క సారిగా అధికారం కోల్పోవడం తో పిచ్చెక్కినట్టు చేస్తున్నారు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

నిర్వాసితులను రెచ్చగొట్టి మూసీ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని చూస్తే మూసీ బాధితులతో ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మూసీ వాటర్ ఫ్లోరైడ్ కంటే డేంజర్ అని అన్నారు. ‘మాది ప్రజా ప్రభుత్వం. మీలాగా.. రూ. 7 లక్షల కోట్లు దోచుకు తినేవాళ్లం కాదు. జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న మాకే ఇంత తెలివి ఉంది..  అమెరికాలో చదువుకున్న నీ తెలివి ఏమైంది.

మూసీ నీళ్ల వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారనే కామన్‌సెన్స్ లేదా. అసలు నువ్వు అమెరికాలో చదువుకున్నావా.. గుంటూరులో చదువుకున్నావా అంటూ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు. దోచుకున్న సంపాదనతో ఎక్కడికన్నా వెళ్లి వ్యాపారాలు చేసుకోక.. మూసీ నిర్వాసితులను ఎందుకు రెచ్చగొడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మూసీ నది ప్రక్షాళనపై ఆయన మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

రూ. 1,000 కోట్లు ఏమయ్యాయి?

‘మూసీ బాధితుడిగా అడుగుతున్నా.. మూసీ ప్రక్షాళన కోసం కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన రూ. 1000 కోట్లు ఏమాయ్యాయ’ని కోమటి రెడ్డి ప్రశ్నించారు. మూసీ కారణంగా ఇక్కడి ప్రజలకు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోనే నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ శాతం పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల రూపాయలు కమీషన్లు మింగారని ధ్వజమెత్తారు.

కమీషన్లు తక్కు వ వస్తాయనే వారు మూసీ ప్రాజెక్ట్ చేపట్టలేదన్నారు. రూ. 15 వేల కోట్లతో మల్లన్నసాగర్ అవసరం ఏముందన్నారు. మల్లన్నసాగర్ పూర్తయి.. 5 ఏళ్లు గడిచినా దిగువనున్న ఆలేరుకు నీరు ఎందుకు వదల్లేదన్నారు. 

ఇటీవలనే తన ఆదేశాలతో ఆలేరుకు నీళ్లు వదిలినట్టు తెలిపారు. ప్రాజెక్టు ల పేరుతో లక్షల కోట్లు మింగిన మీకు మా త్రమే కమిషన్లు అవసరం అని అన్నారు. మూసీకి రూ. 10 వేల కోట్లా.. లక్షన్నర కోట్లా అనేది సమస్య కాదన్నారు. ఎంత ఖర్చయి నా వెచ్చించాలని సీఎం రేవంత్‌ని కోరారు. 

బీఆర్‌ఎస్ పార్టీకీ మానవత్వం లేదు... 

ప్రతిపక్ష పార్టీ నాయకులకు అసలు మానవత్వం లేదన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఏదో ఒక రోజు పోతా య్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. కాళేశ్వరం కట్టడం, కూల డం కూడా అయ్యిందన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై అక్రమ కేసులు పెట్టించిన ఘనత హరీశ్‌రావుకు, బీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు.

నల్లగొండలో మేం పండించిన పంటను వేరే ప్రాంతంలో అమ్ముకొని.. మేం బియ్యం కొనుక్కోవాల్సి వస్తుందని అన్నారు. దేశమంతటికి నీరే జీవనాధారం అయితే.. మాకు మాత్రం మూసీ నీళ్లు శాపంగా మారాయన్నారు. మా జిల్లాలో మంచినీళ్ల కోసం జల సాధన సమితితో పాటు అనేక సంస్థలు ఉద్యమాలు చేశాయని గుర్తు చేశారు. ‘మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నల్లగొండకు మేమే బస్సు పెడతాం.

మీతోపాటే మేము కూడా బస్సులో వస్తాం. మూసీ బాధితుల దగ్గరకు పోదాం. మీరు కచ్చితంగా చెప్పు దెబ్బలు తిని తిరిగి వస్తారన్నారు. ఎస్‌ఎల్‌బీసీని కేసీఆర్ కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని మాయ మాటలు చెప్పిండు. కానీ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కాదు. కదా.. మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా రాలే’దన్నారు. కాళేశ్వ రం కంటే ముందు డిండి మొదలు పెట్టారనే డిండి ఎందుకు పూర్తి కాలేదని నిలదీశారు. 

ఎందుకు మాపై కక్ష? 

‘నల్లగొండ జిల్లా ప్రజలు నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినోళ్లు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సీమాంధ్రులకు వ్యతిరేకంగా కొట్లాడి నోళ్లం. శ్రీకాంతాచారి వల్లనే తెలంగాణ వచ్చింది’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆనాడు భువనగిరి ఎమ్మెల్యే గా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం రాజీనామా చేశారనీ, తాను కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి తీసుకుంటా అని వదిలేశానన్నారు.

తెలంగాణ కోసం కొట్లాడింది మేం అయితే.. మూసీ మురికి మా మొఖాన కొడతారా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అధికారం శాశ్వతం ఉంటుందని భావించిన మీరు నిజాం లెక్క 70 ఏళ్లు పాలించాలని అనుకున్న సంగతి మాకు తెలుసున్నారు. నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వ్యవహారంలో కోర్టు లక్ష రూపాయలు పెనాల్టీ వేసింది’.

కోర్టు పెనాల్టీ వేయడం అంటే పెద్ద క్రైమ్ చేసినట్టుగా భావించాలని హితవు పలికారు. మూసీలో గోదావరి నీళ్లతో పారేలా సీఎం రేవంత్ రెడ్డి మంచి ప్రాజెక్ట్ చేపడుతున్నారని కొనియాడారు. మూసీ ప్రాజెక్ట్‌కు త్వరలోనే డీపీఆర్ వస్తుందన్నారు. ‘అగ్గిపెట్టె రావు.. ఇప్పటికైనా మీరు మారండి నాయనా.. మీకు దమ్ముంటే రండి మూసీ కాలువ వెంట తిరుగుదాం’ అంటూ మంత్రి కోమటిరెడ్డి హితబోధ చేశారు.