calender_icon.png 7 January, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాంటెనెగ్రోలో పేలిన తూటా

03-01-2025 01:37:45 AM

  • మూడు వేర్వేరు చోట్ల దాడులు జరిపిన దుండగుడు
  • 12 మంది మృతి, పలువురికి గాయాలు
  • మద్యం మత్తులో కాల్పులకు తెగబడ్డట్టు అనుమానం

న్యూఢిల్లీ, జనవరి 2: ఆగ్నేయ ఐరోపా దేశమైన మాంటెనెగ్రోలో ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడ్డాడు. మూడు వేరు వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. విషయం తెలిసి పోలీసులు అతడ్ని చుట్టు ముట్టారు. ఈ క్రమంలో అతడు ఆత్మహత్యకు యత్నించాడు.

తీవ్రంగా గాయపడ్డ దుండగుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ దాడికి తెగబడ్డ నిందితుడ్ని 45ఏళ్ల అలెగ్జాండర్‌గా గుర్తించినట్టు పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దాడిని కుట్ర కోణంగా భావించడం లేదని వెల్లడించారు. ఈ దాడిపై మాంటెనెగ్రో ప్రధాని మిలోజ్యో స్పాజిక్ మాట్లాడుతూ కాల్పులకు ముందు నిందితుడు బాగా మద్యం సేవించి ఉంటాడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

మద్యం మత్తులో కాల్పులకు తెగబడి ఉంటాడని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు చెప్పారు. మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు. కాగా 2022లో  సైతం ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో 11 మంది మృతి చెందారు. తుపాకీ వినియోగంపై కఠిన చట్టాలు ఉన్నప్పటికీ నేరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.