మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదలపై బుల్డోజర్ రాజకీయం చేస్తోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శించారు. హైడ్రా విధివిధానాలను ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదని, హైడ్రా పేరుతో ప్రభుత్వ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. బ్లాక్ మెయిల్‌తో వసూలు చేసి ఎన్నికల ఖర్చులకు పంపాలనే అజెండా పెట్టుకుని మురళీమోహన్, రేవంత్‌రెడ్డి సోదరుడికి నోటీసులు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. పేదల ఇళ్లపై పడి సమయం ఇవ్వకుండా కూలగొడుతున్నారని, పెద్దల ఇళ్లు కూలగొట్టబోమని ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్వులో ఉందన్నారు.
హెచ్‌ఎండీఏ పరిధిలో 2,568 చెరువులకు ఎఫ్‌టీఎల్ నిర్ధారించాలని హైకోర్టు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఇప్పటివ రకు 260 చెరువులకు మాత్రమే నిర్ధారణ జరిగిందన్నారు. హైడ్రా చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్నారు. చెరువు పరిధి నిర్ధారణ కాకుండా నోటీసులు ఏవిధంగా ఇస్తారని, రాజకీయ కక్ష సాధింపులకు హైడ్రాను వాడుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ల ను ఎందుకు కూలగొట్టడం లేదని, రేవంత్ రెడ్డికి ఫైళ్లు ఎవరికి పంపాలో తెలియడం లేదన్నారు.
ప్రశ్నిస్తే జైల్లో పెడుతూ రుణమాఫీ చేయాలని ధర్నా చేస్తే తుంగతుర్తిలో తమపై దాడులు చేశారని మండిపడ్డారు. వరద భాదితుల వద్దకు వెళ్తే ఖమ్మంలో మాజీ మంత్రులపె ైదాడులు చేశారని, యూపీలో బుల్డోజర్ రాజకీయాలను రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజకీయాలకు సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రిపుల్ ఐటీపై నిర్లక్ష్యం తగదు: గెల్లు శ్రీనివాస్
వారం రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. విద్యార్థులకు కనీసం వైఫై సౌకర్యం కల్పించడం లేదన్నారు. రెగ్యులర్ వీసీ ఇప్పటివరకు లేరన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి గోడ దూకి బాసర ఐఐఐటీకి వెళ్లారని, అధికారంలోకి వస్తే నాలుగు ట్రిపుల్‌టీలు పెడతామని గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. రాజీవ్‌గాంధీపై కాంగ్రెస్‌కు ఏ మాత్రం గౌరవం ఉన్నా సమస్యలు పరిష్కరించాలన్నారు.