calender_icon.png 19 April, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుల్డోజర్ అన్యాయం!

03-04-2025 12:00:00 AM

డైనమైట్‌ను కనిపెట్టిన తర్వాత దానిని యుద్ధాల్లో ఉపయోగిస్తూ మారణహోమం సృష్టించడాన్ని నోబెల్ తట్టుకోలేక పోయాడట. సైన్స్ శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగపడాలని తను సంపాదించిన డ బ్బుతో ట్రస్టును ఏర్పాటు చేసి నోబెల్ ఫ్రైజులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇప్పుడు బుల్డోజర్‌ను కనిపెట్టిన రైతులు కూడా పశ్చాత్తాప పడేవారేమో. ఇది అతిశయోక్తి కానేరదు.

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో అధికారులు కొందరి ఇండ్లు కూల్చేసేందుకు బుల్డోజర్‌ను ఉపయోగించారు. 2023లో జరిగిన ఘటన అది. అధికారులు అక్కడి గుడిసెలను కూడా వదల్లేదు. అక్కడ ఓ చిన్నారి తన చేతిలో ఉన్న పుస్తకాలు పట్టుకొని భయకంపితురాలై పరుగులు తీసింది. ఈ దృశ్యం అందరినీ కలచి వేసింది. సుప్రీంకోర్టు ధర్మా సనాన్ని కూడా ఈ దృశ్యం ఎంతగానో కలచి వేసింది.

అంతేకాదు, ఈ ఇళ్ల కూల్చివేతపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా దేశ పౌరుల ఇండ్లు కూల్చి వేయడం పూర్తిగా అమానవీ యం, చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. నివాసాలను కూల్చడం ఫ్యాషన్ కాకూడదని హెచ్చరించింది.

బుల్డోజర్ ఇంటిమీదికి వస్తుంటే ఎనిమిదేళ్ల బాలిక ఇంట్లోంచి తన పుస్తకాలు తీసుకుని పరుగులు తీసిన వీడియో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అందుకే, బుల్డోజర్ ఇప్పుడు అనేక ఘటనల్లో దేశంలోని పలుచోట్ల దిగ్భ్రమ కలిగించే యంత్రంగా మారింది. 

2023లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అతీశ్ అహ్మద్ మరణించాడు. అతనికి చెందిన భూమిగా భావించి అందులోని నివాసాలను రాష్ట్ర ప్రభుత్వం పొరపాటున కూల్చివేసిందని బాధితులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అలా కోర్టుకెక్కిన బాధితుల్లో ఒక లాయర్, ఒక ప్రొఫెసర్ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ అభయ్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భు యాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.

‘దేశంలో రూల్ ఆఫ్ లా ఒకటి ఉంది. మరవద్దు’ అంటూ ఇండ్ల కూల్చి వేతలపై ఆగ్రహం ప్రకటించింది. బాధితులకు ఆరు వారాల్లో రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. నిజానికి ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ‘బుల్డోజర్ న్యాయం’ మొదలైంది. నేరస్థుల ఎన్‌కౌంటర్, వారి ఇండ్ల కూల్చివేతలకు ఆ రాష్ట్రంలో లెజిటిమసీ కూడా వచ్చింది.

యూపీలో ఇలా బుల్డోజర్‌ను ఉపయోగించడం తాము ఘనకార్యంగా చూడటం లేదని, ఇక్కడ ఇది అవ సరమని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఆక్రమణల తొలగింపునకు బుల్డోజర్ వాడటమే సరైన మార్గం అని ఆయన భావిస్తున్నారు. ముస్లింల ఆస్తు లను టార్గెట్ చేస్తూ యూపీలో ఈ ‘బుల్డోజర్ న్యాయం’ సాగుతోందని ప్రతిపక్షాలు నిందిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఈ ‘సంస్కృతి’ మహారాష్ట్రకు కూడా పాకింది.

హిందూ జాతీయవాద రాజకీయ పక్షాలకు ఇప్పడు ‘బుల్డోజర్ న్యాయం’ ఒక పేటెంట్. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా ఇదే మార్గంలో మాఫియా, గ్యాంగ్‌రేప్, కిడ్నాపింగ్ నేరాలకు పాల్పడిన వారి ఆస్తులపైకి బుల్డోజర్‌ను పంపించారు.

చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గత ఏడాది పరిశీలించింది. నిందితులు, నేరస్థులపై తక్షణం ఇలా ‘బుల్డోజర్ న్యాయం’ అంటూ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం చెల్లనేరదని స్పష్టంగా పేర్కొంది. షోకాజ్‌లు ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది.