calender_icon.png 15 November, 2024 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుల్డోజర్ చర్యలు రాజ్యాంగ విరుద్ధం

14-11-2024 01:58:14 AM

అధికారులేమీ జడ్జీలు కాదు

నష్టాన్ని అధికారుల నుంచే వసూలు చేస్తాం

న్యూఢిల్లీ, నవంబర్ 13: కొన్ని కేసుల్లో బుల్డోజర్లను ఉపయోగించి నిందితుల ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అధికారులు న్యాయనిర్ణేతలు కాదని, చట్టాన్ని అనుసరించకుండా ఆస్తుల ధ్వంసం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించిన అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పును వెలువరించింది.

దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యలకు మార్గదర్శ కాలు జారీచేసింది. నిబంధనలు పాటించకుండా నిందితులు లేదా దోషులపై బుల్డోజర్ చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ఇందులో మతంతో సంబంధం కూడా ఉండకూడదని స్పష్టంచేసింది. బుల్డోజర్ చర్య ను కూడా కోర్టు నిషేధిస్తూ అధికారులకు కఠిన ఆదేశాలు జారీచేసింది. జరిగిన నష్టాన్ని అధికారుల జీతం నుంచి జరిమానాగా వసూలు చేస్తామని హెచ్చరించింది.   

నోటీసులు ఇచ్చిన తర్వాతే.. 

ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్‌పై దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచా రణ జరిగింది. వీటిని విచారించిన ధర్మాసనం.. ‘అధికారులు జడ్జీలు కాదు. సరైన విధానం పాటించకుండా ఇల్లు కూల్చడం రాజ్యాంగ విరుద్ధం. నేరస్థుడని తేలకముందే శిక్షలు విధించవద్దు. మున్సిపల్ చట్టాలు కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి.

అంతేకాకుండా ఇళ్లను కూల్చేసే ముందు నోటీసులు అందజేసి కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలి. నోటీసులను కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపాలి. ఆ తర్వాత ఇంటిపై నోటీసులు అతికించాలి. కూల్చివేత తప్పనిసరి అయితే అందుకు కారణాలను కూడా వివరంగా తెలియజేయా లి.

అంతేకాకుండా ఇలాంటి చర్యలతో మహిళలు, చిన్నారులు, వృద్ధులను నిరాశ్రయులుగా రోడ్డుపై నిలబెట్టడం సరికాదు. మొత్తం కూలుస్తున్నారా? లేదా కొంతభాగాన్నే తొలగిస్తున్నారా? అనే విషయాన్ని స్పష్టంచేయాలి. ముందుగా ఎవరికి వారే కూల్చివేసుకునేందుకు అవకాశమివ్వాలి’ అని కోర్టు తెలియజేసింది. 

జరిమానాలు వేసి పరిహారం ఇస్తాం..

కూల్చివేతల సమయంలో దాన్ని వీడియో తీయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తప్పు చేస్తే కేవలం జేబులోం చే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, ఆస్తులను కోల్పోకూడదని స్పష్టం చేసింది. ఇష్టారీతిన  రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు పేర్కొంది. ఈ ఆదేశాలను ఎవరైననా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణించి చర్యలు తీసుకుంటా మని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.