calender_icon.png 30 October, 2024 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్లకు బుల్ జోష్

29-10-2024 12:31:36 AM

  1. మళ్లీ 80 వేల మార్కు దాటిన సెన్సెక్స్
  2. 24,300పాయింట్లకు చేరిన నిఫ్టీ
  3. ఐదు సెషన్ల తర్వాత లాభాల్లో సూచీలు

ముంబై: దేశీయ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు, బలహీన త్రైమాసిక ఫలితాల కారణంగా గత ఐదు సెషన్లలో నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్ సూచీలు సోమవా రం బలంగా పుంజుకున్నాయి.ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో బుల్ మళ్లీ పరుగులు పెట్టింది. ఫలితంగా సెన్సెక్స్ మళ్లీ 80వేల మైలురాయిని దాటగా.. నిఫ్టీ  24,300 పైన స్థిరపడింది.ఈ ఉదయం సెన్సెక్స్ 79,653 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు కొనసాగించింది. ఒక దశలో 1100 పాయింట్లకు పైగా లాభపడి 80,539.81 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరిలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడటంతో కాస్త ఒత్తిడికి గురైనప్పటికీ రాణించింది. మొత్తంగా మార్కెట్ ముగిసే సమయానికి 602.75 పాయింట్లు ఎగబాకి 80,005.04 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 24,134 - 24,492 మధ్య కదలాడి చివరకు 158.35 పాయింట్ల లాభంతో 24,339.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.07 వద్ద ఫ్లాట్గా ముగిసింది. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, విప్రో షేర్లు రాణించాయి. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటార్స్ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సూచీ 3.8శాతం, లోహ సూచీ 2.5శాతం మేర పెరిగాయి. స్టాక్ మార్కెట్ సూచీలు ఇటీవల వరుస నష్టాలు చవిచూసిన విషయం తెలిసిందే. నిఫ్టీని పరిగణ నలోకి తీసుకుంటే జీవనకాల గరిష్ఠాల నుంచి దాదాపు 8 శాతం మేర కుంగింది. ఇదే అవకాశంగా భావించి మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు జరపడం ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఆసియా మార్కెట్లు లాభాల్లో ప్రారం భమవడంతో దేశీయ మార్కెట్ సూచీలు అదే బాటలో పయనించాయి. జపాన్ నిక్కీ భారీ లాభాల్లో కొనసాగగా.. ఆస్ట్రేలియా, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లూ పాజిటివ్‌గా కదలాడాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడమూ మరో కారణం. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పటికీ.. చమురు, న్యూక్లియర్ వంటి వాటి జోలికి పోకపోవడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకు న్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన కొంతమేర తగ్గింది. దీంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ సోమవారం 3 డాలర్ల మేర క్షీణించి 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది.