calender_icon.png 25 October, 2024 | 2:43 AM

నిర్మించారు.. నిరుపయోగంగా వదిలేశారు

25-10-2024 12:06:44 AM

  1. వృథాగా గజ్వేల్‌లోని పత్తి మార్కెట్ యార్డు
  2. ఏడాది క్రితం ప్రారంభమైనా ఇంకా వినియోగంలోకిరాని దుస్థితి

గజ్వేల్, అక్టోబర్ 24: పత్తి రైతుల సౌకర్యార్థం గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీఆర్ చొరవతో నిర్మించిన పత్తి మార్కెట్ యార్డు వృథాగా మిగిలిపోయింది. నియోజకవర్గంలో పత్తి సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో 17 ఎకరాల భూమిని సేకరించి రూ.1.27 కోట్లతో పత్తి మార్కెట్ యార్డును నిర్మించారు.

మార్కెట్‌లో ఆఫీస్ బిల్డింగ్, షెడ్డు, ప్లాట్ ఫామ్, మరుగుదొడ్లు, బోరుబావి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు వినియోగించిన దాఖలాలు లేవు. మార్కెట్ యార్డు ప్రారంభించిన నాటి నుంచి పత్తి పంట రావడం ఇది రెండోసారి.

అయినా, ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాకపోవడం గమనా ర్హం. ప్రస్తుతం మార్కెట్ యార్డులో పిచ్చి మొక్కలు పెరిగాయి. కాగా, ఈ మార్కెట్ యార్డుకు ప్రస్తుతం ఒక వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేసి నెలకు రూ.10 వేల వేతనం కూడా ఇస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం లోనే ప్రతి వానకాలంలో సుమారు 70 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, సరాసరి 6 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

గజ్వేల్ నియోజకవర్గం నుంచే కాకుండా సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి కూడా రైతులు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా పత్తి మార్కెట్ యార్డును వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.