calender_icon.png 17 October, 2024 | 7:17 AM

హైదరాబాద్ విస్తరణలో బిల్డర్స్ కీలకం

17-10-2024 02:34:31 AM

నగర విస్తరణకు చర్యలు తీసుకుంటాం

బిల్డర్స్‌తో మీటింగ్‌లో డిప్యూటీ సీఎం భట్టి 

సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి): హైదరాబాద్ విస్తరణలో బిల్డర్స్ పాత్ర గొప్పగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. నగర విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. బుధవారం సచివాలయంలో బిల్డర్స్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. బిల్డర్స్ సమస్యలపై స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర నిర్మాణరంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బిల్డర్స్ కోరిన విధంగా బ్యాంకర్స్‌తో సమావేశాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన అన్ని రకాల వెసులుబాట్లను కల్పిస్తామని భట్టి హామీ ఇచ్చారు. మూసీ పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మరోసారి స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు క్రమంగా కనుమరుగవుతున్నాయని, వాటిని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటామని బిల్డర్స్ చెప్పగా.. డిప్యూటీ సీఎం స్వాగతించారు. అన్ని అంశాలను సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు: మంత్రి ఉత్తమ్

బిల్డర్స్ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే సమావేశం నిర్వహించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. బిల్డర్స్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తామన్నారు.

నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు మంత్రివర్గం నిరంతరం ఆలోచనలు చేస్తోం దన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్, తెలంగాణ క్రెడాయ్ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి, ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు శేఖర్, నారెడ్కో అధ్యక్షుడు విజయ సాయి, తెలంగాణ బిల్డర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.