అందుబాటులోకి కొత్త ఆన్‌లైన్ విధానం
- పట్టణాభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి
- నగరంలో రూ.200 కోట్లకుపైగా ఆదాయం ఉన్న వ్యక్తులు 467 మంది
- సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ టాప్--5 జాబితాలో హైదరాబాద్
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయ క్రాంతి): భవనాలు, లేఅవుట్లకు పారదర్శకంగా అనుమతులివ్వడాన్ని సులభతరం చేసేందుకు ‘బిల్డ్ నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. బిల్డ్ నౌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని శ్రీధర్‌బాబు మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏడాది పరిపాలనా కాలంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ జవాబుదారీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నా మని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధిలో గతంలో ఎన్నడూలేని విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో దాదాపు 60 శాతం జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లోనే ఉం టున్నందున ఈ శాఖ ప్రాధాన్యతపై దృష్టిపెట్టి, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాపారులకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. పర్ క్యాపిటా ఇన్‌కం గ్రోత్ రేటులో 19.3 శాతంతో హైదరాబాద్ నగరం ముందంజలో ఉందని తెలిపారు. అనేక రకాలుగా ఆర్థికాభివృద్ధి చెందుతున్నప్పటికీ రియల్‌ఎస్టేట్ రంగం సింహభాగంలో నిలుస్తుం దన్నారు.
హైదరాబాద్ ప్రజలే హోం లోన్లు అధికంగా తీసుకుంటున్నారని తెలిపారు. డొమెస్టిక్ రెసిడెన్షియల్ ప్రైజ్ అప్రిషియెషన్స్ నివేదికలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. నగరంలో పెరుగుతున్న ఐటీ కంపెనీలతో ఉపాధితోపాటు ఆర్థికవృద్ధి సాధ్యమవుతుందన్నారు.
467 మంది ఆదాయం 200 కోట్ల పైనే..
అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ జాబితాలో హైదరాబాద్ నగరంలో 200 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తులు 467 మంది ఉండటం గర్వకారణమన్నారు. ఐటీ, తయారీ, రియల్‌ఎస్టేట్ వంటి అనేక రంగాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలుస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో 21% హైదరాబాద్‌లోనే ఉన్నాయని స్పష్టం చేశా రు.
ఏడాదికాలంలో అమలుచేస్తున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం కారణంగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్ ఏర్పాటు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ఐటీ, జీసీసీ కంపెనీలకు సుమారు 34 మిలియన్ చదరపు అడు గుల ఆఫీస్ స్పేస్ కావాల్సి ఉందని, దీంతోపాటు రిటైల్, తయారీ రంగాలకు సంబంధిం చి కూడా ఆఫీస్ కావాలని నివేదిక వస్తున్నట్టు వెల్లడించారు.
ఏడాది కాలంలో 22 శాతం లే అవుట్లకు అనుమతులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడు తున్నట్టు స్పష్టంచేశారు. హైదరాబాద్ నగరం ఇప్పటికే ప్రగతిపథంలో దూసుకుపోతుందన్నారు. సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ నివేదికలో ప్రపంచంలో టాప్-5 నగరాల్లో హైదరాబాద్ స్థానం సాధించినట్టు పేర్కొన్నట్టు తెలిపారు.
ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా సరళీకృత పాలనా విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం
అన్ని శాఖల్లో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతన భవన అనుమతులను ఆన్‌లైన్‌లోనే ఆమోదించేలా కార్యాచరణ రూపొందించినట్టు పేర్కొన్నారు. డ్రాయింగ్ ఆటో స్క్రూటినీలో అనుమతుల ప్రక్రియ ఆలస్యమవుతుందని తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు.
అందుకే కొత్త టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు అంతరాయం లేని సేవలు అందించేందుకు బిల్డ్ నౌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ విధానం ద్వారా దేశంలో అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ ఆటో స్క్రూటినీ జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్లాట్ ఫాం ఏఐ ఆధారిత చాట్ సపోర్ట్ సిస్టమ్‌ను కలిగిఉందని, భవన నియమాలు, నిబంధనలపై తక్షణ సమాచారాన్ని పొందడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు.
2డీలో భవన ప్రణాళికలను తనిఖీచేయడానికి బదులుగా 3డీలో తనిఖీ చేసి వివరాలను ధృవీకరించుకోవచ్చని పేర్కొన్నారు. కొత్త విధానంతో హై రైజ్ భవనాల ఆమోదానికి పట్టే సమయం 21 రోజుల నుంచి 15 రోజులకు తగ్గుతుందని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడానికి 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గుతుందని చెప్పారు.
ఈ వ్యవస్థను రెరాతో కూడా అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. ఈ విధానంపై ఆర్కిటెక్టులు, ప్రభుత్వ అధికారులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు రాబోయే రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తామని, డిజిటల్ గవర్నెన్స్‌లోని కొత్త విధానం 2025 ఫిబ్రవరి 1 న ప్రారంభం కానుందని స్పష్టంచేశారు.