25-02-2025 11:15:08 AM
బుగ్గలో శివరాత్రి జాతర కోసం ఏర్పాట్లు సిద్ధం
నేటి నుండి జాతర ప్రారంభం
మొదటిరోజు మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యేలు వినోద్, వివేక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం(Sri Bugga Raja Rajeshwara Swamy Temple) వద్ద మంగళవారం నుండి గురువారం వరకు నిర్వహించనున్న మహా జాతర కోసం ఎండోమెంట్ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అవకాశం ఉండడంతో ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం కోసం క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తుల కోసం షామియానాలను ఏర్పాటు చేశారు. జాతర మొదటి రోజైన మంగళవారం బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ లు బుగ్గలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గంలో బుగ్గ ప్రత్యేకం
బెల్లంపల్లి నియోజకవర్గంలో పురాతన శివాలయం(Lord Shiva Temple)గా బుగ్గ ప్రత్యేకత పొందింది. దేవాలయం గర్భగుడిలోని శివలింగం పై జలధార నిత్యం అభిషేకిస్తూ భక్తులను మైమరిపిస్తుంది. ఈ మహిమను చూసేందుకు మంచిర్యాల ,ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర, గడిచిరోలి ప్రాంతాల నుండి భక్తులు శివరాత్రి ఉత్సవాలకు తరలివస్తారు.
పూర్తయిన రోడ్డుతో భక్తుల్లో ఆనందం
గత కొన్నేళ్లుగా జాతరలో పాల్గొనే భక్తులు మట్టి రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు నానా అవస్థలు పడ్డారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో రూ 2కోట్ల నిధులు మంజూరైన అటవీ అనుమతులు లభించక వెనక్కి వెళ్ళాయి. ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్(Bellampalli MLA Gaddam Vinod Kumar) గెలుపొందాక బుగ్గ దేవాలయానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. గత సంవత్సరం అక్టోబర్ 3న రూ 3 కోట్ల సి ఆర్ ఆర్ నిధులతో బుగ్గ రోడ్డు పనులను ఎమ్మెల్యే వినోద్ ప్రారంభించారు. 3 నెలలు పనులు నత్త నడక నడిచినప్పటికీ శివరాత్రి జాతర సమయం దగ్గర పడుతుండడంతో పనుల్లో వేగం పెంచి పూర్తి చేశారు. దాదాపు 80 శాతం రోడ్డు పూర్తవడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా పడుతున్న ఇబ్బందులను అధిగమించి ఈసారి బుగ్గలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు భక్తులు తరలివచ్చి అవకాశాలు కనిపిస్తున్నాయి.