ముషీరాబాద్, అక్టోబర్ 28: దీపావళి సందర్భంగా నవంబర్ 2న నగరంలో యాదవులు నిర్వహించనున్న సదరు ఉత్సవాలలో హర్యాణా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన దున్నలు అలరించనున్నాయి. ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో హర్యాణా నుంచి ప్రత్యేక వాహనంలో ముషీరాబాద్‌కు భారీ ఆకారంలో ఉన్న గోలు (7 ఏళ్లు) దున్నా, పేర్ (8 ఏళ్లు), గుజరాత్‌కు చెందిన శ్రీకృష్ణ (7 ఏళ్లు), విదాయక్ (8 ఏళ్లు) దున్నలను తీసుకొచ్చారు.
ఆరు అడుగుల ఎత్తు, 1800 కిలోల బరువు ఉన్న ముర్రా జాతికి చెందిన గోలు దున్నా నేషనల్ చాంపియన్ షిప్ పశువుల ప్రదర్శన పోటీలలో రెండుసార్లు విజేతగా నిలిచింది. ఈ దున్న రూ.5 లక్షల అవార్డు సైతం పొందింది. దీని యజమాని నరేందర్ సింగ్.. ముర్రా జాతిని ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా పెంచడంతో పద్మశ్రీ అవార్డును సైతం పొందారు. పేర్ దున్నా భారీ ఆకారంలో ఉండడంతో పాటు పశుమేళా చాంపియన్ షిప్ పోటీలలో పలుమార్లు అవార్డులు పొందింది.
గుజరాత్‌కు చెందిన శ్రీకృష్ణ దున్నా సైతం పశుమేళా ప్రదర్శనలో ప్రోత్సాహక బహుమతులను పొందింది. విదాయక్ దున్నా 1700 కిలోల బరువుతో 6 అడుగుల ఎత్తు, గంభీర ఆకారంతో ఉండడంతో పాటు ప్రత్యేక అవార్డులను పొందింది. ఈ దున్నలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో రెండుసార్లు స్నానం చేయిస్తారు. 20 లీటర్ల పాలు తాగించడంతో పాటు యాపిల్స్, డ్రైఫ్రూట్స్, అరటిపండ్లు, బెల్లం తదితర ఆహారం అందజేస్తారు. కాగా, దున్నలను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోమవారం పరిశీలించారు. సదర్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.