- మాట్లాడటంలో నాకు రోశయ్యే స్ఫూర్తి
- ఇపుడు రోశయ్య లాంటి లీడర్ అసెంబ్లీలో లేడు
- ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తాం
- రోశయ్య వర్ధంతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే రూ. 16 వేల కోట్లతో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిష్కృతమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రోశయ్య 16సార్లు ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నారు.
శాసనసభ, శాసనమండలిలో పోటీపడి మాట్లాడే స్ఫూర్తిని తనకు అందించారని రేవంత్‌రెడ్డి కొనియాడారు. రోశయ్య మూడో వర్థంతి సంద ర్భంగా నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనం తరం సీఎం మాట్లాడారు. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోశయ్య నన్ను తన ఛాంబర్‌ను పిలిపించుకుని బాగా మాట్లాడుతున్నావు.. మరింత అధ్యయనం చేసి సభకు రావాలి’ అని 2007లోనే సూచించారని తెలిపారు. ‘ప్రతిపక్షం ప్రశ్నించాలి.. పాలకపక్షం ఆ సమస్యలు పరిష్కరించాలి.
అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిలదీయాలి ’ అని రోశయ్య చెప్పారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్రశ్నించే వారిని సభలో మాట్లాడనివ్వద్దనే పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు. రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేశారని కొనియాడారు.
నంబర్2 స్థానం రోశయ్యదే..
మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, భవనం వెంకట్రామ్, అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వాలు ప్రశాంతంగా నడిచేందుకు రో శయ్యనే కారణమన్నారు. వారికి కుడి భుజంలా ఉండి సమస్యలను పరిష్కరించేవారని అన్నారు. అందుకే అప్పట్లో ఎవరు సీఎంలుగా ఉన్నా నంబర్2 పొజిషన్ రోశయ్యకు పర్మినెంట్‌గా ఉండేదని, నంబర్ పొజిషన్ మాత్రమే మారుతుండేదని పేర్కొన్నారు.
ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో రోశయ్య మాదిరిగా వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే నేత లేకపోవడంతో ఆ లోటు కనిపిస్తోందన్నారు. ఏనాడు సీఎం కావాలని రోశయ్య తాపత్రయం పడలేదని, సందర్భం వచ్చినప్పుడు ఆయన్ను సోనియాగాంధీ సీఎంను చేశారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏనాడు పదవులు కావాలని అధిష్టాన్ని కోరలేదని, హోదాలన్నీ వాటంతట అవే వచ్చాయన్నారు. రోశయ్యను అందరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆర్యవైశ్యులకు పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.
నగరంలో రోశయ్య విగ్రహం..
50 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లోఇల్లు కట్టుకున్న రోశయ్యను హైదరాబాదీ అని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్యవైశ్య నేతలు స్థలాన్ని ఎం పిక చేస్తే ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో రోశ య్య విగ్రహా నిర్మాణం చేపట్టి నాలుగో వర్థంతి వరకు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు.
కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, రోహిన్‌రెడ్డితో పాటు ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
విలువలకురోశయ్యనే: డిప్యూటీ సీఎం భట్టి
విలువలు, ప్రశాంత జీవితానికి చిరునామ రోశయ్య అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, చీఫ్ విప్‌గా పని చేసినట్లు చెప్పారు.