calender_icon.png 21 March, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీల ఎగవేతల బడ్జెట్

20-03-2025 01:30:00 AM

  1. నిరుద్యోగులకు మరోసారి మొండిచెయ్యే
  2. రైతు సంక్షేమానికి పొంతనలేని కేటాయింపులు
  3. మైనారిటీలపై ఉన్న ప్రేమ బీసీలపై లేదా? 
  4. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్ ‘హామీల ఎగవేతల బడ్జెట్’గా కనిపిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఇది మొండిచేయి చూపించే, గొప్పలు చెప్పుకొనే బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఏలేటి మాట్లాడారు.. “ఆదాయం చారాణా.. అప్పు బారాణా అన్నట్లు”గా ఉందని,  బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయని చెప్పారు.

ఇన్ని రకాలుగా అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈసారి కూడా నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తారని అర్థం అయ్యిందన్నారు. మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుకు రూ.42 వేల కోట్లు అవసరమని, కేటాయింపులు మాత్రం పొంతన లేని విధంగా ఉన్నాయన్నారు.

మరోసారి రైతులను మోసం చేయబోతున్నారని అర్థమవుతోందన్నారు. బీసీ సబ్‌ప్లాన్ ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం దారుణమన్నారు. మైనారిటీలతో పోల్చుకుంటే 16 వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇవ్వాల్సి వస్తుందని కానీ రూ.11 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.

మైనారిటీలపై ఉన్న ప్రేమ బీసీల మీద లేదా అని ప్రశ్నించారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు అని బడ్జెట్‌లో పెట్టారని.. గత బడ్జెట్‌లో కూడా 3,500 ఇండ్లు కట్టిస్తామని చెప్పినా ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. గత బడ్జెట్‌లో తప్పు చేశామని ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు.