calender_icon.png 14 March, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27వరకు..

13-03-2025 01:12:05 AM

  1. మొత్తం 11 రోజులు బడ్జెట్ సమావేశాలు 
  2. -19న బడ్జెట్
  3. 27న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ.. ఆమోదం 
  4. బీఏసీలో నిర్ణయం

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 27 వరకు మొత్తం 11 పనిదినాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈనెల 19న శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన బుధవారం బీఏసీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, బీఆర్‌ఎస్ నుంచి మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి,  బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, కూనంనేని సాంబశివరావు హాజరై అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు.

మాజీమంత్రి హరీశ్‌రావు అసెంబ్లీని 20 రోజులపాటు నిర్వహించాలని కోరారు. ఈ నెలలో బడ్జెట్‌కు ఆమోదం పొందాల్సి ఉండటంతో 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే సరిపోతుందని నిర్ణయం తీసుకున్నారు. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్

గవర్నర్ ప్రసంగంపై గురువారం చర్చ, 14న హోలీ పండుగ సెలవు, 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సమాధానం, 16న సెలవు, 17, 18న ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై చర్చ, 19న బడ్జెట్, 20న సెలవు, 21, 22న బడ్జెట్‌పై చర్చ, 23న సెలవు ప్రకటించారు. 24, 25, 26న పద్దులపై చర్చ నిర్వహించనున్నారు. 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టి బిల్లుకు ఆమోదం తెలపాలని బీఏసీలో నిర్ణయించారు. ద్రవ్య వినియమ బిల్లుకు ఆమోదం తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడనుంది. 

సమావేశాలు 20 రోజులు నిర్వహించాలి: ఎమ్మెల్యే హరీశ్‌రావు 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కనీసం 20 రోజులు నిర్వహించాలని బీఏసీలో డిమాండ్ చేశామని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్  చేశారు. ప్రశ్నపత్రాలు లీక్‌అయినట్లుగానే అసెంబ్లీ బిజనినెస్ ముందే లీక్ కావడంపై అభ్యంతరం తెలిపామన్నారు.

ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామని, సంఖ్యాబలాన్ని బట్టి బీఆర్‌ఎస్‌కు సభలో సమయం ఇవ్వాలని కోరగా, స్పీకర్ తమ విజ్ఞప్తికి అంగీకారం తెలిపారని తెలిపారు. తాగు, సాగునీటి సమస్యలపై చర్చిం చాలని కోరామని, వివిధ ప్రాజెక్టులు కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చించాలని, మం త్రులు కూడా సభకు ప్రిపేర్ అయిరావాలని కోరినట్లు చెప్పారు.

ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసిందని ఆరోపించారు. బిల్లుల చెల్లింపునకు 20 శాతం కమీషన్ విషయాన్ని సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కూలిన పిల్లర్‌ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలన్నారు.