12-03-2025 12:00:00 AM
కేటాయించాలని జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో కులగణన ప్రకారం వెల్లడైన బీసీల జనాభా సంఖ్యకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించకుండా మాజీ సీఎం కేసీఆర్ కాలయాపన చేశారని ఆరోపించారు. బీసీలకు అండగా ఉంటానంటున్న సీఎం రేవంత్‌రెడ్డి బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయిస్తే జీవం పోసినట్లవుతుందని తెలిపారు.
11 బీసీ ఫెడరేషన్లను కాంగ్రెస్ 13 ఫెడరేషన్లకు పెంచినా వాటికి చైర్మన్లను నియమించి పాలక మండలిల నియామకాన్ని, కార్యాలయాల ఏర్పాటు, నిధుల మంజూరు మరిచిందని విమర్శించారు. రాష్ట్రంలో రూ.7వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. లేదంటే రక్తంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి లేఖ రాసి నిరసన తెలుపుతామన్నారు. సమావేశంలో బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేష్‌చారి, బీసీ సంఘాల నాయకులు బాలరాజుగౌడ్, మణిమంజరి, ఈడిగ శ్రీనివాస్, సింగం నగేష్, శ్యాంకురుమ, నర్సింహననాయక్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.