calender_icon.png 27 October, 2024 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్!

24-07-2024 12:52:38 AM

డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి :

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్  యువతీ యువకుల్లోని నైపుణ్యాలు మెరుగు పరిచేలా, వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఉంది. విద్య, ఉపాధితో పాటు యువతలో నైపుణ్యాల వృద్ధికి ఏకంగా రూ.1.48 లక్షల కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనం. రానున్న ఐదేళ్లలో ఔత్సాహికులు కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పే విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం, రాష్ట్రప్రభుత్వాల సహకారంతో నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ కేంద్రాల నిర్వహణకు ముందుకు రావడం యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తామనడం, ప్రస్తుత విద్యా విధానంలోకి వస్తున్న ఆధునిక మార్పులకు అనుగుణంగా సంస్కరణలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఉన్నత విద్యలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ముందుకు వచ్చి, తద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తామని చెప్పడం ఆశాజనకంగా ఉంది. వీటితో పాటు నైపుణ్య లోన్ పూచీకత్తు లేకుండా రూ.7.5 లక్షల వరకు లోన్ ఇస్తామని ప్రకటించడం, తద్వారా ఏటా వేలాది మంది యువతకు మేలు జరుగుతుందని కేంద్రం ప్రకటించింది. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే కాక, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తామని చెప్పడం యువతకు భరోసానిచ్చింది.

దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 500 కంపెనీలను భాగస్వాములను చేస్తామనడం, ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఒక్కో విద్యార్థికి రూ.5 వేల అలవెన్స్, సింగిల్ టైం అసిస్టెన్స్ కింద రూ.6 వేలు ఇస్తామనడం యువతను ఆకర్షిస్తోంది. అలాగే యువతకు శిక్షణ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును సైతం ఆయా కంపెనీలే భరించాలని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) నిధుల నుంచి 10% ఇంటర్న్‌షిప్ కోసం వినియోగించవచ్చని చెప్పడం మంచి ఆలోచన. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులకు ప్రాక్టీకల్ జ్ఞానంతో పాటు మార్కెట్‌లో వాస్తవంగా ఉన్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉన్నది. పుస్తకాల్లో చదివి తెలుసుకున్న అంశాలను ఇంటర్న్‌షిప్‌లో  ప్రయో గించుకునేందుకు వీలు కలుగుతుంది.

ముద్ర రుణాలకు కొర్రీలు..

కేంద్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవడం శుభపరిణామం. ఈ ప్రయత్నాన్ని అదరూ ఆహ్వానించాలి. కానీ గడిచిన పదేళ్లలో నైపుణ్యాలకు సంబంధించిన విషయంలో కేంద్రం వెనుకబడిందనేది వాస్తవం. ముద్ర పథకం ద్వారా రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెంచడం మంచి పరిణామమే. కానీ రుణ కేటాయింపు విషయంలో బ్యాంకులు సవాలక్ష కొర్రీలు పెట్టడం ఇబ్బందికరం. ఈ కారణాలతో యువత ముద్ర రుణాలు తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండే విధి విధానాలు అమలు చేస్తే పథకం సత్ఫలితాలనిస్తుంది.

సమన్వయంతో పనిచేస్తేనే..

నైపుణ్యాల శిక్షణ కేంద్రాలు విజయవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. పక్కాగా ఉమ్మడి ప్రణాళిక అమలు చేస్తే యువతకు మేలు జరిగే అవకాశం ఉన్నది. శిక్షణ కేంద్రాలు నడిపే విషయంలో ప్రభుత్వాలు అశ్రద్ధ వహిస్తే ఆశించిన మేర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందవు. శిక్షణ కేంద్రాల్లో నైపుణ్యాలు పొందిన యువత ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు సాధించుకోగలుగుతారు. యువత శక్తియుక్తులను సక్రమంగా వినియోగించుకోకపోతే మున్ముందు దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగమనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.  కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా మరిన్ని విశ్వవిద్యాలయాలను నెలకొల్పి, యువతకు నాణ్యమైన విద్య అందించాల్సిన ఆవశ్యకత ఉంది.

పరిశోధకులకు ఊతం..

యువత నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే వాకె మెరుగైన ఉపాధి అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఐదేళ్ల కాలంలో నాలుగు కోట్ల మంది యువతీ యువకుల నైపుణ్యాభివృద్ధికి తోడ్పడి, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అందుకు రూ.2 లక్షల కోట్ల నిధులు కేటాయించడం ఆహ్వానించదగిన విషయం. మహిళల కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షణీయం. అనుసంధాన్ జాతీయ రీసర్చ్ ఫండ్ ఏర్పాటు చేసి తద్వారా రీసెర్చ్ అండ్ డెవలపెంట్  వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముందుకు రావడం, అందుకు రూ.లక్ష కోట్లు కేటాయించడం అభినందనీయం. ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశోధనలకు ఊతమిస్తామనడం పరిశోధకులకు శుభవార్త. తయారీ రంగంలోకి తొలిసారి వచ్చిన యువతను ప్రోత్సహించేందుకు ఒక నెల జీతం బోనస్‌గా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండటం స్వాగతించాల్సిన విషయం.

 అసిస్టెంట్ ప్రొఫెసర్, 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ