calender_icon.png 22 December, 2024 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్ ‘వెనుకబడింది’

06-10-2024 01:21:10 AM

నిధుల విడుదలేది? 

  1. పదేళ్లుగా ‘బీసీ’లకు కేటాయింపులే.. 
  2. విడుదలకు నోచుకోని నిధులు 
  3. గత పాలనలో కేటాయించింది 8,233 కోట్లు 
  4. 1,795 కోట్లు విడుదల చేసినా.. ఖర్చు 911.2 కోట్లే
  5. లక్ష ఆర్థిక సాయంలోనూ నిర్లక్ష్యమే.. 
  6. లక్షల్లో దరఖాస్తులు.. 48 వేల మందికే  సాయం 
  7. బీసీల అభివృద్ధికి కొత్తగా 8 కార్పొరేషన్‌లు

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ ఏర్పాటు తర్వాత బీసీల అభివృద్ధి, సంక్షేమం అనుకున్న స్థాయిలో జరగలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు మరింత వెనుకబడ్డారు.

పదేళ్లలో బీసీ సంక్షేమానికి కేటాయించిన, విడుదల చేసిన, ఖర్చు చేసిన నిధులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. బీసీ కులాల అభివృద్ధి కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కులాల వారీగా ఫెడరేషన్లు అనుసంధానం చేస్తూ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి, స్వయం ఉపాధి, కులవృత్తులు నిర్వహించుకునేందు కు అర్హులైనవారికి ఆర్థికసాయం చేసేందుకు ఫెడరేషన్లను తీసుకొచ్చినట్టు చెప్పింది. కానీ ఫెడరేషన్ల ద్వారా అందిచాల్సిన సాయానికి అవసరమైన మేర బడ్జెట్‌లో ప్రాధాన్యతనివ్వలేదు. నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టింది.  

కేటాయింపులు రూ.8 వేల కోట్లు.. ఖర్చు 911 కోట్లు 

20౧4--15 నుంచి 2023--24 వరకు బీసీల అభివృద్ధికి ఆయా కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు కలిపి మొత్తం రూ.8,233.97 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అందులో రూ.1,795.31 కోట్లు విడుదల చేయగా, అందులో కేవలం 911.2 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2019--20 నుంచి 2022--23 ఆర్థిక బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించకపోవడం గమనార్హం. 

దరఖాస్తులొచ్చినా సాయం చేయలే 

స్వయం ఉపాధి, కులవృత్తులను నిర్వహించుకుంటామని సాయం కోసం 2014-15లో 3.60 లక్షల దరఖాస్తులు రాగా, 2017లోనూ మరో 5.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిలో 2018 ఎన్నికల సందర్భంగా 40 వేల మందికి రూ.50 వేల చొప్పున మాత్రమే సాయం అందించి గత ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

దీంతోపాటు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు ఆర్థికసాయం పేరుతో రూ. లక్ష అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని అందుకునేందుకు దాదాపు 5.28 లక్షల దరఖాస్తులు రాగా, వీటిలో కేవలం 48,120 మందికి ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున రూ.481 కోట్లను మాత్రమే అందించింది.

దీంతో మిగిలిన దరఖాస్తుదారులు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నారు. సంక్షేమం అందించడంలో నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన వర్గాల వారంతా సరైన సాయం అందక, బయట రుణాలు లభించక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

నామమాత్రపు నిధులే..

గత ప్రభుత్వం బీసీ శాఖ కింద రజక, నాయీ బ్రాహ్మణ, గౌడ, వడ్డెర, ఉప్పర, వాల్మీకి బోయ, కృష్ణ బలిజ, పూసల, భట్‌రాజా, కుమ్మరి, శాలివాహన, మేదర, విశ్వ బ్రాహ్మణులతో కలిపి మొత్తం 11 ఫెడరేషన్లను ఏర్పాటు చేసింది. కానీ వాటి అభ్యున్నతికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల్లో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. బడ్జెట్‌లో కొంత వరకు నిధులు కేటాయించినా వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. 

కార్పొరేషన్ల వారీగా..

 బీసీ కార్పొరేషన్ ద్వారా సావిత్రిభాయి ఫూలే యోజన కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బీసీలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఈ పథకంలో పలు మార్పులు చేసి ఆదాయ పరిమితిని రూ.75 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచింది. 2014-15 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు రూ.2,642 కోట్లను కేటాయించగా, పదేళ్లలో కేవలం రూ.711.29 కోట్లే ఖర్చు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పైగా 2019-20, 2020-21 ఏడాదుల్లో అసలు ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు. 2021-22, 2022-23 ఏడాదుల్లో రూ.803 కోట్లను కేటాయించగా.. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఇక 2023-24 ఏడాదిలో రూ.503 కోట్లను కేటాయించగా, రూ.లక్ష ఆర్థిక సాయం పథకం కోసం రూ.481 కోట్లను ఖర్చు చేసింది. 

* అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థను 2017లో ఏర్పాటు చేశారు. దీని ద్వారావివిధ కేటగిరిల్లో ఆర్థిక సాయం చేయాలని సర్కారు నిర్ణయించినా నిధులను మాత్రం కేటాయించలేదు. కార్పొరేషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఏడేళ్లలో రూ.3,605 కోట్లు కేటాయించినా... కేవలం రూ.14.20 కోట్లే ఖర్చు చేసింది.

2017-18, 2018-19 బడ్జెట్‌లో ఏడాదికి రూ.1000 కోట్లు చొప్పున రూ.2 వేల కోట్లు కేటాయింపులు చేసినా, రూ. 351.50 కోట్లను మాత్రమే విడుదల చేయగా.. రూ.7.09 కోట్లే ఖర్చు చేయడం విశేషం. 2019-20లో రూ.5 కోట్లు కేటాయించినా.. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఇక 2020-21,2021-22, 2022-23, 2023-24 ఏడాదుల్లో కలిపి మొత్తం రూ.1,600 కోట్లు కేటాయించగా కేవలం రూ.7.11 కోట్లనే ఖర్చు చేసిందంటే ఎంబీసీలకు ఎంత సాయం అందిందో స్పష్టమవుతుంది. 

నాయీ బ్రాహ్మణులకు..

* నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌కు 2014-15 నుంచి 2023-24 వరకు ఐదేళ్లలో రూ.560 కోట్లు కేటాయించి.. రూ.99.26 కోట్లు విడుదల చేయగా, కేవలం 38.19 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. 2019-20 నుంచి 2023-24 వరకు ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు.

కాగా నాయీ బ్రాహ్మణుల హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూని ట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించే పథకాన్ని 2021లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకోసం 2021-22 నుంచి 2023-24 వరకు బడ్జెట్‌లో రూ.197.20 కోట్లను కేటాయించినా రూ.45.15 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం.

* వడ్జెరల అభివృద్ధి కోసం తెలంగాణ వడ్డెర సహకార సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేసింది. 2014-15 నుంచి 2023-24 వరకు రూ.70.28 కోట్లను కేటాయించగా.. రూ.48.46 కోట్లను విడుదల చేసి.. కేవలం రూ.17.50 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. దీంతోపాటు 2029-20 నుంచి 2021-22 వరకు బడ్జెట్‌లోనూ ఒక్క రూపాయి కేటాయించలేదు. 2022-23, 2023-24లో కలిపి రూ.6 కోట్లు కేటాయించి ఖర్చేమి చేయలేదు. 

* సగర, ఉప్పరల కోసం సమాఖ్యను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 2014-15 నుంచి 2023-24 వరకు బడ్జెట్‌లో రూ.33.84 కోట్లను కేటాయించినా... రూ.4.43 లక్షలనే ఖర్చు చేయడం గమనార్హం. 2019-20 నుంచి 2021-22 ఏడాదిలో ఒక్క రూపాయి బడ్జెట్‌ను కేటాయించలేదు. 2022-23, 2023-24 ఏడాదుల్లో కలిపి రూ.4 కోట్లు కేటాయింపులు చూపినా... రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 

* వాల్మీకి బోయల కోసం ఏర్పాటు చేసి సమాఖ్యకు గత ప్రభుత్వం పదేళ్లలో కలిపి 35.46 కోట్లు కేటాయింపులు చేయగా, ఖర్చు చేసింది కేవలం రూ.5.98 కోట్లు మాత్రమే. 2019-20 నుంచి 2021-22 వరకు బడ్జెట్‌లో కేటాయింపులే చేయలేదు. కాగా 2022-23, 2023-24లో కలిపి రూ.5 కోట్లను కేటాయించినా ఖర్చుకు నోచుకోలేదు. 

* కృష్ణ బలిజ, పూసల అభివృద్ధికి సైతం 2014-15 నుంచి 2023-24 వరకు రూ.26.09 కోట్లను కేటాయిస్తే, రూ.17.44 కోట్లను విడుదల చేయగా.. వీటిలో కేవలం రూ.5.34 కోట్లు మాత్రమే ఖర్చు జరిగింది. రూ.6 కోట్లను కేటాయిస్తున్నట్టు చూపినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. 

వీరికీ మొండిచేయ్యే..

- భగ్రాజా సహకార సంఘాల్లోని వర్గాల అభివృద్ధికి 2014-14 నుంచి 2023-24 వరకు రూ.17.30 కోట్లు కేటాయించగా.. రూ.11.27 కోట్లను విడుదల చేయగా.. కేవలం రూ.95 లక్షలను మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. పదేళ్లలో ఈ వర్గాల అభివృద్ధికి కనీసం రూ.కోటి  కూడా ఖర్చు చేయకపోవడం గమనార్హం. అంతేకాదు 2019-20 నుంచి 2021-22 వరకు ఒక్క రూపాయి కేటాయింపులు చేయలేదు.

2022-23, 2023-24 ఏడాదుల్లో కలిపి రూ.4 కోట్లను కేటాయించినా ఖర్చు మాత్రం శూన్యం. - కుమ్మరి శాలివాహనలకు గడిచిన పదేళ్లలో రూ.61.79 కోట్లను కేటాయించి రూ.49.04 కోట్లు విడుదల చేస్తే అందులో ఖర్చు చేసింది మాత్రం కేవలం రూ. 12.07 కోట్లే. అయితే 2019-20 నుంచి 2021-22 వరకు కేటాయింపులే జరగలేదు. 2022-23, 2023-24 ఏడాదుల్లో రూ.6 కోట్లను కేటాయించినా రూపాయి ఖర్చు చేయలేదు.

- మేదరలకు అభివృద్ధికి 2014-15 నుంచి 2023-24 వరకు రూ. 24.08 కోట్లు కేటాయించి, రూ.14.83 కోట్లను విడుదల చేయగా అందులో ఖర్చు చేసింది కేవలం రూ.4.09 కోట్లు మాత్రమే. ఈ ఫెడరేషన్‌కు కూడా 2019-20 నుంచి 221-22 వరకు బడ్జెట్ కేటాయించలేదు. 2022-23, 2023-24 లో కలిపి కేటాయించిన రూ. 6 కోట్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.

కాగా 2016-17 లోనూ కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల కార్పొరేషన్ లిమిటెడ్‌కు 2014-15 నుంచి 2022-23 వరకు రూ.92.11 కోట్లను కేటాయించి, రూ.73. 39 కోట్లు విడుదల చేయగా అందులో కేవలం రూ.26.94 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కాగా 2019-20 నుంచి 2021-22 వరకు ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించలేదు. 2022-23, 2023-24 ఏడాదులకు కలిపి సంవత్సరానికి రూ. 6 కోట్ల చొప్పున కేటాయించినా ఒక్క రూపాయి ఖర్చు జరగలేదు. 

రజకులకు అదే పరిస్థితి..

తెలంగాణ రజక సహకార సంఘాల సమాఖ్య కింద రజకులకు 60 శాతం నుంచి 100 శాతం రాయితీతో పలు పరికరాలు, స్వయం ఉపాధి కోసం 2014-2015 నుంచి 2023-24 ఏడాది వరకు రూ.451 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింద. రూ.71.52 కోట్లే విడుదల చూపించినప్పటికీ కేవలం రూ.31.29 కోట్లే ఖర్చు చేసింది.

2019-20 నుంచి 2023-24 వరకు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయంపులు చేయకపోవడం గమనార్హం. సామూహిక సేవ, ధోబీ ఘాట్ నిర్మాణాలకు 2014-15 నుంచి 2023-24 వరకు రూ.180 కోట్లు కేటాయించగా రూ.30.98 కోట్లు మాత్రమే విడుదల చేసి అందులో రూ.14.85 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

2019-20, 2020-21 ఏడాదుల్లో అసలు బడ్జెట్ కేటాయింపులే లేవు. అయితే రజకుల లాండ్రీ, ధోబీ ఘాట్‌ల నిర్వహణకు రూ.250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకాన్ని 2021లో ప్రవేశపెట్టింది. అందుకోసం 2021-22 నుంచి 2023-24 వరకు మొత్తం రూ.210.50 కోట్లను కేటాయించగా ఇందులో రూ.75.86 కోట్టే ఖర్చు చేసింది. 

కొత్తగా 9 కార్పొరేషన్లు 

గత ప్రభుత్వ హయాంలో బీసీలకు ఆర్థిక చేయూత ఆశించిన స్థాయిలో జరగలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి బీసీలను ఆదుకుంటామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన హామీ అమలులో భాగంగా అప్పటికే ఉన్న ఆయా కులాల ఫెడరేషన్లు, రెండు కార్పొరేషన్లకు అదనంగా మరో 8 కార్పొరేషన్లను, ఒక వెల్ఫేర్ బోర్డును కొత్తగా ఏర్పాటు చేసింది.

వాటిలో తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్, తెలంగాణ యాదవ కుర్మ కార్పొరేషన్, తెలంగాణ మున్నూరుకాపు కార్పొరేషన్, తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్, తెలంగాణ పెరిక కార్పొరేషన్, తెలంగాణ లింగాయత్ కార్పొరేషన్, తెలంగాణ మేర కార్పొరేషన్, తెలంగాణ గంగపుత్ర కార్పొరేషన్, తెలంగాణ ఈబీసీ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేసింది.

వీటన్నింటికీ 2024-25 ఏడాది బడ్జెట్‌లో ఒక్కోదానికి రూ.50 కోట్ల చొప్పున రూ.450 కోట్లను కేటాయించగా, మొత్తం బీసీ శాఖ పరిధిలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు అన్నింటికీ కలిపి రూ.2,372.21 కోట్లను కేటాయించింది. 

గౌడ, ఉప్పర, కృష్ణ బలిజలపైనా నిర్లక్ష్యమే...

తెలంగాణ కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ కింద 2014-15 నుంచి 2023-24 వరకు రూ.186 కోట్లను బడ్జెట్‌లో కేటాయించినా..రూ. 25.41 కోట్లే విడుదల చేయగా.. కేవలం రూ.18.79 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2019-20 నుంచి 2021-22 వరకు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదు. 2022-23, 2023-24 ఏడాదుల్లో రూ.110 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి విడుదల కాలేదు. 

గత పదేళ్లలో....(కోట్లలో)

కార్పొరేషన్ కేటాయింపులు విడుదల ఖర్చు

బీసీ 2,642 --- 711.29

ఎంబీసీ 3,605 --- 14.20

రజక 451 71.52 31.29

నాయీబ్రాహ్మణ 560 99.26 38.19

గౌడ 186 25.41 18.79

వడ్డెర 70.28 48.46 17.50

సగర, ఉప్పర 33.84 ---- 4.43(లక్షలు)

వాల్మీకి బోయ 35.46 ---- 5.98

కృష్ణ బలిజ, పూసల 26.09 17.44 5.34

భట్రాజు 17.30 11.27 95(లక్షలు)

కుమ్మరి శాలివాహన 61.79 49.04 12.07

మేదర 24.08 14.83 4.09

విశ్వబ్రాహ్మణ 92.11 73.39 26.94