calender_icon.png 25 October, 2024 | 5:51 AM

పెప్సీ, కోకాకోలా నుంచి ‘బడ్జెట్’ డ్రింక్స్!

25-10-2024 12:00:00 AM

రిలయన్స్ కాంపా ఎఫెక్ట్

ముంబయి: పెప్సీ, కోకాకోలా కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రిలయన్స్ కన్జూమర్ ప్రొడకట్స్ లిమిటెడ్ తీసుకొచ్చిన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపా  నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో.. పెప్సీ, కోకాకోలా తక్కువ ధరలో సాఫ్ట్ డ్రింక్స్‌ను తీసుకురావాలని చూస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పానీయాల ధరల కంటే ఇవి 15-20 శాతం తక్కువకే లభించనున్నాయి. కాంపాకు పెరుగుతున్న డిమాండ్‌ను ఎదుర్కోడానికి కంపెనీలు ఈ ఆలోచన చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఒకప్పటి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపాను కొనుగోలు చేసిన రిలయన్స్ సంస్థ గతేడాదిలో దాన్ని రీలాం చేసింది. ఇతర కంపెనీల కంటే తక్కువ ధరలతోనే మార్కెట్లో వీటి విక్రయాలు చేపట్టింది. దీంతో క్రమంగా విక్రయాలు పెంచుకుంది. ప్రత్యర్థుల కంటే అధిక మార్జిన్‌ను సంపాదించుకుంది. దీంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న పెప్సీ, కోకాకోలా సంస్థలు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.

మార్కెట్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకొనే ప్రయత్నంలో పడ్డాయి. ఈ మేరకు తక్కవ ధరలో సాఫ్ట్ డ్రింక్స్ని తీసుకురావాలనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న బ్రాండ్ల ధరలను యథాతథంగా కొనసాగించనున్నాయి.తక్కువ ధరల విభాగంలో పోటీపడేందుకు కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి సిద్ధంగా పెప్సీ సిద్ధంగా ఉందని వరుణ్ బేవరేజెస్ ఛైర్మన్ రవి జైపురియా అన్నారు.

సరైన వ్యూహంతో మార్కెట్లో తన వాటాను మెరుగుపరుచుకోనున్నట్లు తెలిపారు. కాంపా నుంచి పోటీని ఎదుర్కొనేందుకు కోకాకోలా కూడా తన ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా మరిన్ని ప్రాంతీయ బ్రాండ్లను తీసుకురావాలని చూస్తోంది.