calender_icon.png 10 February, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్ సవాల్

10-02-2025 12:55:16 AM

2025-26 పద్దు రూపకల్పనకు ఆర్థికశాఖ తర్జన భర్జన

  1. 2024-25లో ముగిసిన మూడు త్రైమాసికాలు 
  2. నిరుటి కంటే రూ.12,695.42 కోట్ల ఆదాయం తగ్గుదల
  3. నిరాశపరిచిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్, వాహనాల పన్ను, మైనింగ్‌శాఖలు
  4. అంచనాలు దేవుడెరుగు.. గతేడాది వచ్చిన ఆదాయమైనా రాని పరిస్థితి
  5. అదాయం తగ్గడంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఆదాయం బడ్జెట్ అంచనాలను అందుకోకపోవడం, కనీసం గతేడాది వచ్చిన రాబడిని ఈసారి రాబట్టుకోలేకపోవడంతో 2025- 26 వార్షిక బడ్జెట్ తయారీ రాష్ట్ర ఆర్థికశాఖకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వానికి ఆదాయా న్ని తీసుకురావడంలో ముఖ్యభూమిక పోషించే కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, వాహనాల పన్ను, మైనింగ్‌శాఖ లక్ష్యాలను చేరుకోకపోవడంతోనే ఇలాంటి గడ్డు పరిస్థితి ఏర్పడింది. 

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మూడు త్రైమాసి కాలు ముగిశాయి. ప్రస్తుతం నాలుగో త్రైమాసికం నడుస్తున్నది. రాష్ట్రప్రభుత్వం నెలకు రూ.18,436 కోట్ల సొంత ఆదాయాన్ని అంచనా వేస్తూ.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గడిచిన తొమ్మిది నెలల్లో ఏ నెల కూడా ప్రభుత్వానికి చెప్పుకోదగిన ఆదాయ రాలేదు. డిసెంబర్‌లోనైతే కేవలం రూ.9 వేల కోట్ల ఆదాయం వచ్చింది.

2023-24 ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది రాబడి పెరుగుతుందని ప్రభుత్వం భావించినప్పటికీ, కనీసం గతేడాది వచ్చిన ఆదాయాన్ని కూడా ఆయా శాఖలు రాబట్టకపోవడం గమనార్హం. సీఎం రేవంత్‌రెడ్డి ఇదే అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు భేటీ అయి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.

నిరాశపరిచిన ఐదు విభాగాలు..

ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విభాగాల్లో కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, వాహనాల పన్ను, మైనింగ్‌శాఖలు ముఖ్యమైనవి. వీటి లో ఒక్క వాణిజ్య పన్నుల శాఖ నుంచే ఏడాదికి రూ.85 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. వార్షిక వృద్ధి రేటు 18శాతం నమోదైతే కమర్షియల్ ట్యా క్స్ ఈ అంచనాలను అందుకుంటుంది.

కా నీ.. వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటివరకు 7.87శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదు చేసింది. అంటే ఇక్కడ దాదాపు 10.33శాతం లోటు కనిపిస్తున్నది. ఇక ఎక్సైజ్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, వాహనాల పన్ను, మైనింగ్ శాఖల్లోనైతే వృద్ధిరేటు మైన స్(-) లో నమోదు కావడం గమనార్హం.

గతేడాదితో పోలిస్తే మైనింగ్ శాఖ వృద్ధి రేటు 2 శాతం తగ్గింది. వాహనాలపై పన్ను కూడా 2శాతం తగ్గింది. ఎక్సైజ్ ఆదాయం గతేడాది కంటే భారీగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

లీకేజీలకు అడ్డుకట్ట ఏదీ ?

లీకేజీలకు అడ్డుకట్ట వేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చన్న ధీమాతో రాష్ట్రప్రభుత్వం 2024- 25 బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ.. లీకేజీలను అరికట్టడంలో యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. దీంతో సర్కారుకు అంచనాలు తప్పుతున్నాయి.

ఇసుక మైనింగ్‌లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని తాజాగా తెలంగాణ లారీ అసోషియేషన్ ఏకంగా రాష్ట్రప్ర భుత్వానికే లేఖ రాసే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే ప్రభు త్వ ఖాజానా పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈ అంశాన్ని యంత్రాంగం అంతగా పట్టించుకోనట్లు కనిపిస్తున్నది. ఇక వాణిజ్య పన్నుల శాఖలో అక్రమాల గురించి చెప్పనక్కర్లేదు. 

పెంచాలా? మళ్లీ అంతే ఉంచాలా ?

బడ్జెట్ రూపకల్పనకు రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్రమైన కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే అన్ని ప్రభుత్వశాఖల నుంచి అంచనాలు తెప్పించుకున్నది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సైతం శాఖల వారీగా అంతర్గత సమీక్షలు నిర్వహించారు. అంచనా వేసింది ఎంత? వచ్చింది ఎంత? లోటు ఎం త? అన్న వివరాలను ఆరా తీశారు.

ఆ వివరాలను కేంద్ర బడ్జెట్ విడుదలైన రోజు జరిగిన రాష్ట్ర ఆర్థిక శాఖ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డికి భట్టి వివరించినట్లు తెలిసింది. ఇప్పుటివరకు వచ్చిన ఆదాయాన్ని బట్టి.. 2025- 26 బడ్జెట్ పెంచాలా? లేదా అన్న సందిగ్ధంలో ఆర్థిక శాఖ ఉన్నట్లు తెలుస్తోంది.