- రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం నిర్ణయం
- 17 నుంచి ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ
- పెండింగ్‌లోనే 53 వేల అప్లికేషన్లు
కామారెడ్డి,సెప్టెంబర్ 12(విజయక్రాంతి): కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొన్నేళ్లుగా వివాహలు చేసుకున్న, ఉమ్మడి కుటుంబం నుంచి వేరైన వారికి రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. అలాగే పిల్లల చదువులు, ఇతర విషయాల్లో ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం త్వరగా రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో రేషన్ కార్డులు కావాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో 23 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాపాలనలో మరో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కొత్త కార్డుల కోసం మొత్తం 53 వేల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెల 17 నుంచి ప్రారంభించే ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో జిల్లాలో రేషన్ కార్డు లేనివారిలో ఆశలు చిగురిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలు రేషన్‌కార్డుల కోసం ఎదురు చూసినా దరఖాస్తులు తీసుకున్నారే తప్ప కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదు.కాంగ్రెస్ ప్రభు త్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఎదురు చూపులు..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021 జూలై నెలలో కొన్ని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసే ఎత్తలేదు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన వారు, పెండ్లి అయిన వారు కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు వారికి ఒకే రేషన్ కార్డు ఉండటం, అందులో భర్త పేరు ఒక కార్డులో, భార్య పేరు మరొక కార్డులో, పిల్లల పేర్లు ఏ కార్డులో లేక ఇబ్బందులు పడుతున్నారు.
అదేవిధంగా సూరత్, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు కరోనా తర్వాత సొంత గ్రామాలకు వచ్చారు. వారికి కూడా రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం అందించే రేషన్ బియ్యంతో పాటు, ఆరోగ్య శ్రీ సేవలు అందడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం అందించే సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ తో పాటు రైతు రుణమాఫీలో కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎదురు చుస్తున్నారు.
30 వేల అప్లికేషన్లు..
ఇప్పటివరకు జిల్లాలో అన్నిరకాల రేష న్ కార్డులు కలిపి 2,53,474 ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహించింది. ఇందులో తమకు కార్డులు కావాలని 30 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంతకముందు బీఆ ర్‌ఎస్ హయాంలో 23 వేల మంది ఆన్‌లైన్‌లో అప్లు చేసుకున్నారు. దీంతో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య జిల్లాలో 53 వేల కు చేరింది. ఇప్పటికీ వీరికి నిరీక్షణ తప్పడం లేదు.
అదేవిధంగా పేర్ల మార్పిడి, కార్డుల బదీలీలు, కొత్త సభ్యులను చేర్చ డం వంటి దరఖాస్తులు మరికొన్ని ఉం టాయి. కాగా ప్రభుత్వం కొత్త కార్డుల జారీ వేగవంతం చేస్తే జిల్లాలో కొత్తగా 53 వేల కుటుంబాలకు మేలు జరుగనుంది. ఈ నెల 17 నుంచి నిర్వహించే ప్రజాపాలన లో రేషన్ కార్డులకు మళ్లీ కొత్త అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన..
మాకు పెండ్లి అయి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు పిల్లలు. మాకు రేషన్ కార్డు లేదు. నా భార్య పేరు వాళ్ల తల్లిదండ్రుల రేషన్ కార్డులో, నా పేరు మా తల్లి దండ్రుల కార్డులో ఉంది. మాఇద్దరి పిల్లల పేర్లు ఏ కార్డులో లేవు. దీంతో బియ్యం రావడంలేదు. నా కుటుంబానికి కొత్త రేషన్ కార్డు కావాలని ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నా. ఈ సారైనా కార్డులు మంజూరు చేయాలి.
సామల ప్రశాంత్‌రెడ్డి,
అడ్లూర్ ఎల్లారెడ్డి,కామారెడ్డి జిల్లా
రేషన్‌కార్డు మంజూరు చేయాలి
గత ప్రభుత్వం లో రేషన్ కార్డు మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్‌కార్డు అడుగుతున్నారు. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నా నేటికీ రేషన్ కార్డు జారీ కావడం లేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరిగినా లాభం లేకుండా పోయింది. ప్రభుత్వం ప్రత్యేకంగా చొర వ తీసుకొని రేషన్ కార్డు అందజేయాలి.
మొసర్ల పావని,
అడ్లూర్ ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా