calender_icon.png 30 October, 2024 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో బుద్ధిస్ట్ సర్యూట్

01-09-2024 01:52:27 AM

  • వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా బుద్ధవనం
  • నాగార్జునసాగర్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 
  • హైదరాబాద్ సాగర్ మధ్య ఫోర్ లేన్ రహదారి
  • హుస్సేన్‌సాగర్ చుట్టూరా స్కు వాక్ వే
  • పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దేశ విదేశాల్లోని బుద్ధిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజి యం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.

కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతోపాటు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్‌లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‌ను పంపించింది.

రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితోపాటు ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజి యంను ఈ ప్రణాళికలో పొందుపరచనుంది. ఇందులో భాగంగా  నాగార్జునసాగర్ బుద్ధ వనాన్ని టూరిజం, స్పిరిచ్యువల్ డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. నాగార్జున సాగర్ డ్యామ్ అందాలతోపాటు పరిసరాల్లోని బుద్ధ వనాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నది. 

పర్యాటకానికి రోడ్ కనెక్టివిటీ

నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్‌వరకు బోట్‌లో విహరించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీల రూపకల్పనపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్ నిర్మించే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ రహదారికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 

ట్యాంక్‌బంద్ చుట్టూ స్కైవాక్ వే

ట్యాంక్‌బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కు వాక్ వే డిజైన్ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా రూపొందించాలని భావిస్తున్నారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూనా డిజైన్లు తయారు చేయించాలని నిర్ణయించారు.

పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటుచేసి సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకుగా అయ్యాయని, వాటిని విశాలంగా విస్తరించాలని సీఎం నిర్ణయించారు.  ఆక్రమణలుంటే తొలగించాలని, ప్రజలు, దుకాణాదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.