calender_icon.png 14 January, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరాయలొద్దిలో బౌద్ద బ్రహ్మ విహారం

18-09-2024 12:00:00 AM

శ్రీరామోజు హరగోపాల్ :

సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలో మోయుతుమ్మెదవాగు (నది)కి దక్షిణాన ఉన్న సింగరాయలొద్ది సింగరాయ (నరసింహస్వామి) జాతరకు ప్రసిద్ధి. 100 అడుగుల ఎత్తున్న ఈగుట్టకొసన ఒక చిన్నబండసొరికెలో నరసింహ స్వామి వెలిశాడు. దానికి చిన్న దేవాలయ ద్వారం ఉంది. గుడికి వెళ్ళే దారిలో చిన్న పందిరి నీడలో సున్నపురాతి పురాతన నాలుగు తలల బ్రహ్మశిల్పం ఉంది. ఆ విగ్రహం దొరికిన స్థానమేదో చెప్పేవాళ్ళు లేరు. కానీ ప్రస్తుతం దారిపక్కన చిన్న పందిరి నీడలో పాత గుడి రాళ్ళ మధ్య ఈ దేవుడున్నాడు.

బ్రహ్మశిల్పాని కెదురుగా దాదాపు 50 అడుగుల వ్యాసంతో వృత్తాకారంలో పరుచుకున్న ఇటుకలు, అవి జారిపోకుండా వాటికి చుట్టు రాళ్ళ అంచు చేర్చి ఉంది. దక్షిణపు భాగంలో కొండపైనుంచి వానకాలంలో పారే ఒర్రె కాలువ ఉంది. ఈ ఇటుకల వృత్తం నడుమ కూలిపోయిన గుడి స్తంభాలు, గుడికి సంబంధించిన రాళ్ళున్నాయి. పెద్దపుట్ట పెరిగి ఉంది. సరిగా అక్కడికి దక్షిణ దిశలో 100 అడుగుల దూరంలో ఉన్న ఆంజనేయుని విగ్రహానికి దగ్గరలో 20 అడుగుల వ్యాసమున్న మట్టిఒరల బాయి ఉంది.

తర్వాత కాలంలో స్తూపాన్ని కూల్చేసి అక్కడ గుడి కట్టి ఉండొచ్చు. గుడిస్తంభాలు రాష్ర్టకూటశైలికి చెందినవి.  ఆ కూలిన గుడికిపై భాగంలో భైరవుడి విగ్రహం ఉంది. ఆపైన గుట్టకొసన సొరికెలో నరసింహస్వామిని ప్రతిష్టించారు. 7వ శతాబ్దకాలంలో బౌద్ధ, జైనమతాల స్తూపాలు, చైత్యాలు, బసదులు, విహారాలమీద కాలాముఖుల వంటివారు దాడులు చేసి నిర్మూలించినట్టు, వాటిని హిందూ దేవాలయాలుగా మార్చినట్టు దాఖలాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఆ ఇటుకల కొలతలు 14.8.4 అంగుళాలు. కొన్ని ఇటుకలు 20 అంగుళాల పొడుగున్నాయి.

నల్లగొండ జిల్లా నాగారంలో మహా దేవివిహారంవద్ద, చాడ బౌద్ధస్తూపం వద్ద అన్వేషించినపుడు కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి లభించిన ఆనవాళ్ళే ఇక్కడ కూడ లభించాయి. అక్కడక్కడ పలుచని కుండపెంకులు దొరుకుతున్నాయి. నునుపుదేరిన నూరేరాయి, రాతిపలకలు, స్తూపంమధ్యలో అడుగున పునాదికి వాడే వృత్తకారపు రాతిముక్క, పూర్తిగా శిథిలస్థితిలో ఉన్న నల్లరాయి స్తంభం వంటిది అక్కడ లభిస్తున్నాయి. గుప ్తనిధుల కోసం తవ్విపోసిన గుంటల్లో ఇటుక గోడల జాడలు కనిపిస్తున్నాయి.

స్తూపాలకు, చైత్యాల్లోని శిల్పాలకు కూడా సున్నపురాతిని వాడింది బౌద్ధులు. సింగరాయలొద్దిలో ఉన్న ఈ శిల్పం విశిష్టమైన రీతిలో మలిచిన శిల్పం ఎత్తు రెండడుగులు. రెండుచేతులు, చక్కని జటామలకంతో నాలుగు శిరస్సులు, కనుపాపలగుపించని మీననేత్రాలు, ధోవతి వంటి అధోశాటిక, నడుమున రత్నాల పట్టి, దండరెట్టలకు, ముంజేతులకు కట్టిన ఆభరణాలు, పెద్ద చెవులకు పెద్ద కుండలాలు, రెండు వరుసల కంఠహారాలతో అలంకరించిన విగ్రహం. కానీ కుడిచేయి విరిగిపోయింది. అయితే అది అభయముద్రలో ఉండవచ్చు.

ఎడమచేతిలో సన్నని మెడ ఉన్న పాత్ర (కమండలం) ఉంది. ఈ శిల్పాకృతిని పోలిన బుద్ధుని విగ్రహాలు నాలుగు తలల, నాలుగు లేదా ఆరు చేతులతో నిలబడిన, కూర్చున్న స్థితుల్లో బుద్ధుని శిల్పాలు సింగపూర్, థాయ్ లాండ్ వంటి బౌద్ధమతం ఆదరింపబడుతున్న దేశాల్లో ఉన్నాయి. చతుర్ముఖత్వం హిందూదేవతల్లోనే కాక బౌద్ధంలో కూడా ఉంది.

సింధ్ (పాకిస్తాన్)లో మీర్పూర్ ఖాస్ సమీపాన గుప్తుల కాలానికి చెందిన (క్రీ.శ.5 లేదా 6 శతాబ్దాలు) బ్రహ్మ 3 అడుగుల కంచు విగ్రహం చూసినట్టు హెన్రీ కోసెన్స్ 1929లో ఒక నివేదిక ఇచ్చాడు. ఈ శిల్పం మూడడుగుల కంచు బ్రహ్మవిగ్రహం. స్థానక స్థితిలో ఉన్న ఈ శిల్పానికి నాలుగు తలలు, రెండు చేతులు, ధోవతి, యజ్ఞోపవీతం ఉన్నాయి. ఆభరణాలు లేవు. కరాచీ మ్యూజియంలో ఉండేదీ విగ్రహం. సరిగా అట్లాంటి పోలికతోనే ఉన్నది సింగరాయలొద్దిలోని బ్రహ్మశిల్పం. ఈ శిల్పానికి ఆభరణాలున్నాయి. ఇది 6వ శతాబ్దానికి చెందినదై వుంటుంది. కానీ ఈస్తూపం 1వ శతాబ్దకాలానికి చెందినదై ఉండొచ్చు. ఉద్దేశికస్తూపం కావడం వల్లనేమో నిరాలంకారంగా ఉంది. 

మోయుతుమ్మెద వాగును కలుపుకున్న ఈ మానేరు ఉప నదీప్రవాహం (వేర్వేరు గ్రామాలవద్ద వేర్వేరు పేర్లతో పిలవడం పరిపాటి) వెంట బౌద్ధం ఆనవాళ్ళు ఎక్కువగానే లభిస్తున్నాయి. మానేరు నది ఎగువ, దిగువ రిజర్వాయర్ల ప్రవాహ మార్గంలో ఇరువైపుల నుంచి వచ్చిన వాగులు నల్గొండ జిల్లా ఆలేరువాగు (భిక్కేరు)లో ఒక్కటవుతున్నాయి. దానిలోకి ఐదేళ్ళ క్రితం బయటపడ్డ బౌద్ధస్తూపం ఉన్న చాడ నుంచి వాగు వచ్చి కలుస్తుంది. ఈ ప్రవాహం తర్వాత మూసీలో కలుస్తుంది. ఈ నదీప్రవాహాలు ఉత్తర వాహినులైన చోట బౌద్ధం ఆనవాళ్ళు కనిపించడం విశేషం.

బ్రహ్మ మొదలైన హిందూదేవతలు వజ్రయాన బౌద్దంలో ఆరాధింపబడ్డారు. అందులో బ్రహ్మలు 

1.బకబ్రహ్మ(మజ్జిమనికాయ), 2. బ్రహ్మసహంపాతి(సంయుత్త నికాయ), 3.బ్రహ్మ సనత్కుమార (జానవసభ సుత్త), 4. మహాబ్రహ్మ(బ్రహ్మజల సుత్త) అని నలుగురు. అందులో బ్రహ్మసహంపాతిని పోలి ఉన్నదే సింగరాయలొద్దిలోని శిల్పం. తుషిత స్వర్గంలో ఉన్నపుడు బోధిసత్వుడు (బుద్ధుడుగా అవతరించక పూర్వం) బ్రహ్మను మరి నలుగురు దేవరాజులను భూలోకంలో జన్మించమని ఆదేశించాడట. అట్లా బౌద్ధంలో అవతరించిన బ్రహ్మను బౌద్ధులు ఆరాధించారు. కానీ బ్రహ్మకు ప్రత్యేకంగా విగ్రహం పెట్టిన చైత్యాలున్నట్టు మన దేశచరిత్రలో ఎక్కడా పేర్కొనలేదు. బాలిద్వీపంలో బ్రహ్మ ‘విహార’ ఉంది. నిజానికి బ్రహ్మ విహారమంటే బౌద్ధంలో అత్యుత్తమ భావనాస్థితి. ఈ స్థితులు నాలుగు విధాలుగా ఉంటాయని బౌద్ధమతంలో చెప్పబడి ఉంది. బౌద్ధ విహారంలో బ్రహ్మను ప్రతిష్టించింది బహుశః ఇక్కడే కావచ్చు. ఇందుకు సింగరాయలొద్ది బౌద్ధానికి అపురూపమైన తావు. 

సింగరాయలొద్దిలోని ఇటుకలనిర్మాణం బౌద్ధస్తూపానికి చెందినదే. పక్కన ఉన్న ఇటుకల కట్టడాలు చైత్య, విహారాలై ఉండొచ్చు. ఈ గుట్ట దిగువన  బండరాళ్ళతో, మట్టితో పడిగెరాయి కింద కట్టిన సత్రం వంటిది ఉంది. రాతిపడక వంటిది ఉన్నది. సరిగా ఈ ప్రదేశానికి మోయుతుమ్మెదవాగుకు (తూర్పు) ఆవలి ఒడ్డున 1 కి.మీ.దూరంలో సన్యాసులమఠం, మునులగుహ అని పిలువబడే బౌద్ధుల వస్సావాసం (వర్షావాసం) ఉంది. (అందులో ఇపుడు చిన్న ఆంజనేయుని పలక బొమ్మల్నిపెట్టి ఆరాధనాస్థలంగా మార్చివేశారు) దీనికి తలాపున గట్టుమీద దమ్మకుంట ఉంది. ఈ గుట్టకు వెనక వైపున దమ్మసాగరమనే ఊరుంది. నాగసముద్రం అనే గ్రామం ఇక్కడికి దగ్గరే. ఆ ఊళ్లో బౌద్ధనాగార్జునాచార్యుడు నివసించినట్లుగా జనం చెప్పుకుంటున్నారు.

ఆ విగ్రహం, అక్కడ ఉన్న ఇటుకల నిర్మాణం, మట్టిఒరలబాయి, మునుల గుహ ఇవన్నీ ఆ స్థలం బౌద్ధం హీనయానం నుంచి మహాయాన, వజ్రయానాలకు పరివర్తన చెందినకాలం వరకు బౌద్ధధార్మిక క్షేత్రమై ఉంటుందని నిరూపిస్తున్నాయి. ఒక్క అడుగు మట్టిపొరలను ఒలిచి చూసినా సందేహాలన్ని తొలగిపోతాయి. నిస్సందేహంగా సింగరాయలొద్ది బుద్ధ ధర్మానికి ఆరామమని తెలిసిపోతుంది. అన్నింటికన్నా ముందు ఏ రక్షణ లేక అడివిలో ఉన్న బుద్ధ(బ్రహ్మ)ని గ్రామంలోకో, మ్యూజియంలోకో చేర్చి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.