calender_icon.png 4 February, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా బుద్ధి శ్రీనివాస్

04-02-2025 12:37:50 AM

మేడ్చల్, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా బుద్ధి శ్రీనివాసును అధిష్టానం నియమించింది. అధ్యక్ష పదవిని పలువురు ఆశించినప్పటికీ బుద్ధి శ్రీనివాస్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ప్రస్తుత అధ్యక్షుడు విక్రం రెడ్డి మరోసారి పదవి ఆశించినప్పటికీ అవకాశం లభించలేదు. విక్రం రెడ్డి నాలుగేళ్లు పదవిలో కొనసాగడం, సామాజిక కారణాలవల్ల అవకాశం లభించలేదని తెలుస్తోంది.

జిల్లా అధ్యక్ష పదవిని విక్రమ్ రెడ్డి, బుద్ధి శ్రీనివాస్, ఎల్లంపేట జగన్ గౌడ్, హేమారెడ్డి, శోభా రెడ్డి, వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, తిరుమల్ రెడ్డి తదితరులు ఆశించారు. చాలామంది అధ్యక్ష పదవిని ఆశించినందున అధిష్టానం ఏకాభిప్రాయం కుదిర్చింది. శనివారం వీరందరిని పార్టీ కార్యాలయానికి పిలిపించి చర్చించింది. ఎవరికి అధ్యక్ష పదవి వచ్చిన కలిసి పనిచేస్తామని ప్రమాణం చేయించింది. ఆ తర్వాత బుద్ధి శ్రీనివాస్ చే నామినేషన్ వేయించింది.

సోమవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. బుద్ధి శ్రీనివాస్ పార్టీలో గ్రామస్థాయి నుంచి వివిధ పదవులు చేపట్టారు. మూడు చింతలపల్లి మండలం జగన్ గూడ ఉప సర్పంచ్ గా పనిచేశారు. షామీర్పేట మండల్ పార్టీ అధ్యక్షుడిగా, మేడ్చల్ నియోజకవర్గం కన్వీనర్ గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 

శ్రీనివాస్ మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందినవారు. అర్బన్ జిల్లా అధ్యక్ష పదవిని అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. ఏడాదికాలంగా అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. గతంలో హరీష్ రెడ్డి అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేయగా మల్లారెడ్డి ఇన్చార్జి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.