24-02-2025 12:54:53 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్(బీటీపీఎస్)లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్లాంట్‌కు సంబంధించి బీహెచ్‌ఈఎల్ చేయాల్సిన పెండింగ్ పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం ప్రజాభవన్‌లో పనుల పురోగతిపై జెన్‌కో అధికారులతో భట్టి సమీక్షించారు.
బీటీపీఎస్‌లో బీహెచ్‌ఈఎల్ కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం చేయాల్సిన ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి నిర్ధిష్ట గడువు నిర్ధేశించి దానికి అనుగుణంగా పనులు చేయించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం సీజన్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తడి బొగ్గుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల సంస్థకు నష్టం వస్తుందని డిప్యూటీ సీఎంకు చెప్పడంతో.. కోల్‌ను నిల్వ చేయడానికి కావాల్సిన షెడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భట్టి ఆదేశించారు.
జెన్‌కో పరిధిలోని విద్యుత్తు కేంద్రాల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్ అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్లాంట్‌లో పని చేయడానికి కావాల్సిన నాన్ టెక్నికల్ కార్మికులను ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా స్థానిక గిరిజనులను నియమించాలని సూచించారు. విద్యుత్తు ఉత్పత్తికి వాడుతున్న బొగ్గు ద్వారా వస్తున్న బూడిదను వినియోగంలోకి తీసుకురావాడానికి ఆలోచన చేస్తున్నట్టు వివరించారు.
స్థానిక ట్రైబల్ యువతను స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించడానికి బూడిదతో ఇటుకలు తయారు చేయించే యూనిట్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జెన్‌కో డైరెక్టర్లు ఆజయ్, సచ్చిదానందం, లక్ష్మయ్య, చీఫ్ ఇంజినీర్లు శ్రీనివాస్‌రావు, రత్నాకర్ రావు, పీవీ శ్రీనివాస్, జేవాకూమార్, రాంప్రసాద్ పాల్గొన్నారు.