పటాన్ చెరు,(విజయక్రాంతి): గుర్తు తెలియని వాహనం ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది. అమీన్ పూర్ ఇన్స్ పెక్టర్ సదా నాగరాజ్ తెలిపిన వివరాలు ప్రకారం... సంగారెడ్డికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కిష్టన్న కుమారుడు హేమంత్ కుమార్(22) మేడ్చల్ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సంగారెడ్డి నుంచి ద్విచక్ర వాహనంపై రాకపోకలు చేస్తున్నాడు.
గురువారం సంగారెడ్డి నుంచి స్నేహితుడు ప్రణయ్ కుమార్ తో కలిసి కళాశాలకు బయలుదేరాడు. కిష్టారెడ్డిపేట్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం వీరి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హేమంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రణయ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రణయ్ కుమార్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అమీన్ పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.