calender_icon.png 24 October, 2024 | 3:57 PM

బీటెక్ అడ్మిషన్లు@లక్ష

12-09-2024 12:31:56 AM

  1. కన్వీనర్ కోటాలో ఇప్పటికే 75,107, స్పాట్‌లో మరో 3,700 
  2. మేనేజ్‌మెంట్ కోటాలో 20 వేలు సీట్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి బీటెక్‌లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా కలిపి లక్షకు చేరుకున్నాయి. 2023 విద్యాసంవత్సరంలో కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కలిపి 91,001 భర్తీ అయ్యాయి. ఈసారి అదనంగా 10 వేల వరకు సీట్లు అదనంగా భర్తీ అయ్యాయి. చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయ్యే నాటికి 75,107 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందారు. స్పాట్ అడ్మిషన్లలో మరో 3,700 మందికి సీట్లు కేటాయించారు.

ఇవి కాకుండా మరో 20 వేలకు పైగా సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ అయ్యాయి. ఇలా అన్ని సీట్లు కలిపి కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా ముగిసేనాటికి మొత్తం లక్ష వరకు సీట్లు భర్తీ అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 156 ఇంజినీరింగ్ కాలేజీలుండగా, వాటిలో మొత్తం 1,05,965 సీట్లు ఉన్నాయి. వీటిలో 31,790 (30 శాతం) సీట్లు మేనేజ్‌మెంట్ కోటా సీట్లుంటాయి. వీటిని ఆయా కాలేజీల యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి. అయితే వీటిలో 20 వేలకుపైగా సీట్లు భర్తీ అవుతాయని అధికారులు చెప్తున్నారు. 

బ్రాంచీల వారీగా ఇలా 

కన్వీనర్ కోటాలో 86,943 సీట్లుండగా, తుది విడత కౌన్సిలింగ్ పూర్తయ్యేనాటికి 75,107 (86.39 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో సీఎస్‌ఈ, వాటి అనుబంధ కోర్సుల్లో 61,587 సీట్లకుగానూ 57,637 (93.59 శాతం) సీట్లు భర్తీ కాగా, 3950 సీట్లు మిగిలాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో 16,692 సీట్లకు, 12,672 (75.92 శాతం) సీట్లు భర్తీకాగా, 4020 సీట్లు మిగిలాయి. సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో 7,458 సీట్లలో  4081 (54.72 శాతం) భర్తీ కాగా, 3377 సీట్లు మిగిలాయి. ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో 1206 సీట్లు ఉంటే, 717 (86.39 శాతం) సీట్లు భర్తీకాగా, 489 సీట్లు మిగిలాయి. మొత్తం 11,836 సీట్లు మిగులగా వీటికి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించారు. వీటిలోనూ 3,700 సీట్లు భర్తీ అయ్యాయి. 

పెరిగిన సీట్లకు కౌన్సిలింగ్ ఎలా? 

ప్రైవేట్ కాలేజీలకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో సీట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఆయా కాలేజీలు హైకోర్టును గతంలో ఆశ్రయించాయి. సీట్ల పెంపునకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ మాప్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పెరిగిన సీట్లకు కౌన్సిలింగ్ ఎలా నిర్వహించాలో స్పష్టత లేక అధికారులు అయోమయంలో ఉన్నారు. కోర్టు అనుమతులతో దాదాపు 4 వేల సీట్లు పెరగనున్నాయి. పెరిగిన సీట్లపై విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.