చెన్నై, జూలై 14 : తమిళనాడు బీఎస్పీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు ప్రధాన నిందితుడు తిరువేంగడం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. శనివారం సాయంత్రం కస్టడీ నుంచి పారిపోయే క్రమంలో పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు. దీంతో, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. చెన్నై నార్త్ అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ నరేంద్ర నాయర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. కాగా, ఈ నెల 5న తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు కే ఆర్మ్ స్ట్రాంగ్‌ను తన ఇంటికి సమీపంలోనే బైకులపై వచ్చిన ఆరుగురు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యను బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. హత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.