calender_icon.png 28 April, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకా పాక్ చెరలోనే బీఎస్‌ఎఫ్ జవాన్

28-04-2025 12:14:22 AM

పొరపాటున సరిహద్దు దాటి పాక్‌లోకి వెళ్లిన పూర్ణం కుమార్ 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: పొరపాటున సరిహద్దు దాటి పాక్ సైన్యం చేతిలో బందీగా మారిన బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా గురించిన సమాచారం ఇంకా తెలియట్లేదు. షా రాకపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన భార్య రజనీ మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం గర్భిణీగా ఉన్నా.  సోమవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌కు వెళ్తా. నా కుమారుడితో పాటు ముగ్గురు బంధువులు కూడా నా వెంట వస్తారు’ అని తెలిపారు.

పశ్చిమబెంగాల్‌కు చెందిన పూర్ణం కుమార్ బీఎస్‌ఎఫ్ 182వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సరిహద్దు విధులు నిర్వర్తిస్తూ.. పొరపాటున పాక్ సరిహద్దులోకి వెళ్లాడు. దీంతో పాక్ రేంజర్స్ అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్ణం షా పాక్ రేంజర్స్‌కు చిక్కి 90 గంటలు దాటిపోయింది. అయినా అతడి విడుదల గురించి ఎటువంటి సమాచారం లేదు.

దీంతో ఆయన కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పూర్ణం షాను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ చౌదరి ఈ విషయం గురించి కేంద్ర హోం సెక్రటరీతో చర్చలు జరిపారు. ఎలాగైనా సరే జవాన్‌ను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.