- బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను ప్రోత్సహిస్తున్నది..
బెంగాల్ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రులు అమిత్‌షా, గిరిరాజ్ సింగ్ ఆరోపణలకు కౌంటర్
కోల్‌కతా, జనవరి 2: బీజేపీకి అసలైన బ్లూప్రింట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఎస్‌ఎఫ్ కనుసన్నల్లోనే బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చొరబాట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. కోల్‌కతాలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఎస్‌ఎఫ్ జవాన్లు మహిళలను హింసిస్తున్నారని మండిపడ్డారు.
చొరబాట్లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బంగ్లాదేశ్‌తో తమకు ఎలాంటి శతృత్వం లేదని, కానీ.. అక్కడి నుంచి చొరబాట్లను మాత్రం ఉపేక్షించబోమని ప్రకటించారు. ‘బెంగాల్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల కారణంగా బెంగాల్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నది’ అని ఇటీవల ఓ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు.
అలాగే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా.. ‘బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లకు బెంగాల్ నర్సరీగా మారింది’ అని వ్యాఖ్యానించారు. ఇద్దరి కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు తాజాగా సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. చొరబాట్ల అంశంపై అధికార పార్టీ టీఎంసీకి, ప్రతిపక్షపార్టీ బీజేపీకి మధ్య వాగ్యుద్ధం జరుగుతున్నది.