13-02-2025 11:04:29 AM
ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ ముందు మహిళ దారుణ హత్య.
- అత్యాచారం అనంతరం హత్య జరిగినట్లు అనుమానం.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. జనరల్ ఆసుపత్రి వెనుక భాగంలోని ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్(Urdu Medium Primary School) గెట్ ముందు గుర్తు తెలియని దుండగుల చేత ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కావాలి శాంతమ్మ (50)గా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చేదని భర్త, పిల్లలు ఎవరూ లేకపోవడంతో అనాదిగా బ్రతుకుతూ అక్కడే ఉచిత భోజనం సేకరిస్తూ జనరల్ ఆస్పత్రి పరిసరాల్లోనే గడిపేదని గ్రామస్తులు చెప్తున్నారు. కాగా ఆమెపై అత్యాచారం జరిపి అనంతరం హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ హత్యకు గల కారణాలు, దుండగులు ఎవరనే విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రధాన రహదారికి కూత వేటు దూరంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.