calender_icon.png 23 October, 2024 | 5:09 AM

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడి దారుణ హత్య

23-10-2024 02:45:37 AM

  1. కత్తులతో నరికి చంపిన దుండగులు
  2. పాత కక్షలే కారణమని అనుమానం
  3. జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్తత

కరీంనగర్, అక్టోబరు 22 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జగిత్యాల రూరల్ మండలం జాబి తాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మారు గంగారెడ్డి(50) మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు.

ఉదయం పనిముగించుకుని ఇంటికి బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా కారుతో ఢీకొట్టారు. గంగారెడ్డి కింద పడిపోగానే అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా నరికారు. కత్తులతో కడుపులో పొడిచారు.

గంగారెడ్డికి తీవ్ర గాయా లు కావడంతో అప్రమత్తమైన స్థానికులు, కుటుంబసభ్యులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గంగారెడ్డి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

నన్ను కూడా హత్య చేసినట్లే: ఎమ్మెల్సీ 

హత్య గురించి తెలుసుకున్న జీవన్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. గంగారెడ్డి హత్యకు నిరసనగా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనుచరుని హ త్య చేయడమంటే తనను కూడా హత్య చేసినట్లేనని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

క్రి యాశీలంగా పనిచేస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జాం అయింది. దీంతో వాహనాలను బైపా స్ మీదుగా మళ్లించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జాబితాపూర్‌లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు గంగారెడ్డి హత్యకు రాజకీయ కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణం లో దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గంగారెడ్డి హత్యకు పాత కక్షలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంతో ష్ అనే వ్యక్తిపై గంగారెడ్డి పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. 

పరారీలో సంతోష్..

గంగారెడ్డిని అదే గ్రామానికి చెందిన సంతోష్‌గౌడ్ అనే యువకుడు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. సంతోష్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. భూ వివాదాలు, పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారం హత్య జరిగిందని, దీనికి రాజకీయ కక్షే కారణమని జీవన్ రెడ్డితోపాటు తన అనుచరులు పేర్కొంటుండడంతో పోలీసులు చేసే దర్యాప్తు ద్వారానే అసలు విషయాలు బహిర్గతం కానున్నాయి.