14-03-2025 12:32:44 AM
చేవెళ్ల, మార్చి 13: వైన్స్‌లో వాచ్ మన్ గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.షాబాద్ సీఐ కాంతారెడ్డి వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని జై భీమ్ కాలనీకి చెందిన భిక్షపతి(35) స్థానికంగా ఉన్న శ్రీదుర్గ వైన్స్ లో వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి వైన్స్ మూసివేసిన తర్వాత పర్మిట్ రూమ్లో పడుకున్నాడు.
గురువారం ఉదయం 10 గంటల సమయంలో వైన్స్ కు వెళ్లిన సిబ్బంది చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లిన సీఐ కాంతా రెడ్డి, ఎస్త్స్రలు సతీష్ కుమార్, రమేశ్ ... నిందితులు వైన్స్ వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడి కౌంటర్ లో ఉన్న రూ.20 వేలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పర్మిట్ రూమ్లోకి వెళ్లి చూడగా వాచ్ మన్ భిక్షపతి రక్తపు మడుగులో శవమై కనిపించాడు.
ఈ సమాచారం అందుకున్న ఏసీపీ కిషన్, సీసీఎస్ ఏసీపీ శశాంక్, సీసీఎస్, ఎస్వోటీ ఇన్ స్పెక్టర్లు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం, ఫింగర్ ఫ్రింట్ టీమ్ తో పాటు డాగ్ స్వ్కాడ్ ను పిలిచించి ఆధారాలు సేకరించారు. నిందితులు సీసీ కెమెరాల డాటా నిల్వ చేసే హార్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకెళ్లారని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.