calender_icon.png 24 September, 2024 | 8:56 AM

బీఆర్‌ఎస్‌వి కాకమ్మ కబుర్లు

24-09-2024 02:39:49 AM

వారి హయాంలో సర్కారు దవాఖానాల పరిస్థితి ఎలా ఉండేదో చూసుకోవాలి

పదేళ్ల పాలనా వైఫల్యాలను మాపై రుద్దుతున్నరు 

మంత్రి దామోదర్ రాజనర్సింహ 

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనేలా పరిస్థితి ఉండేదని, పదేళ్ల పాలనా వైఫల్యాలను మా ప్రభుత్వానికి ఆపాదించేందుకు బీఆర్‌ఎస్ నాయకులు ప్రయతిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో ఆరోపించారు. గాంధీ ఆసుపత్రిలో మరణాలను ప్రభుత్వ వైద్యుల వైఫల్యంగా చిత్రీకరించడం బీఆర్‌ఎస్ నేతల అజ్ఞానానికి నిదర్శనమని, గాంధీ మరణాలపై రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలోనే గాంధీలో మరణాలు ఎక్కువని... 2022లో 500 మంది, 2023లో 542 మంది చనిపోయారని లెక్కలతో వివరించారు. కాగా.. 2024లో ఇప్పటి వరకు 309 మంది మాత్రమే మృత్యువాత పడ్డట్లు పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిని కార్పోరేట్ తరహాలో అభివృద్ధి చేసేందుకు తమ సర్కారు కట్టుబడి ఉందన్నారు. అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా పేదలకు అందించే ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలనే తమ సంకల్పాన్ని అడ్డుకోలేరని అన్నారు. ఆరోగ్య శాఖలో ఖాళీలకు గత ప్రభుత్వమే కారణమని తెలిపారు. హడావిడిగా 25 మెడికల్ కళాశాలల జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని.. కానీ వాటికి అవసరమైన సిబ్బందిని మాత్రమే కేటాయించలేదని ఫైర్ అయ్యారు.