calender_icon.png 24 October, 2024 | 4:07 AM

మూసీపై బీఆర్‌ఎస్‌ది రాద్ధాంతం

24-10-2024 02:16:46 AM

  1. ప్రజలు అనారోగ్యం పాలవుతుంటే పట్టదా?
  2.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, అనిల్‌కుమార్‌రెడ్డి   

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మూసీ కలుషిత నీటి వల్ల అనేక రకాల జబ్బులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకు మూసీ మురికిని వదిలించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే బీఆర్‌ఎస్ రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న దొంగ ఉద్యమాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి వీరేశం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వల్ల మంచి రోజులు వచ్చాయని మూసీ నిర్వాసిత ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు.

కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్.. మూసీ కోసం రూ.20 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పాలని వీరేశం డిమాండ్ చేశారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు. కేటీఆర్ నల్లగొండ జిల్లాకు వచ్చిన బుక్కెడు మూసీ నీళ్లు తాగి చూడాలన్నారు.

మూసీ ప్రక్షాళనకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 26న భువనగిరి నియోజకవర్గంలోని పిలాయిపల్లిలో మూసీ ఒడ్డున సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.