హైదరాబాద్: కేసీఆర్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాన్ని ఒక మలుపు తిప్పిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 17 రోజుల బస్సు యాత్రతో రెండు జాతీయ పార్టీలు దిగివచ్చి, తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టాయని ఎద్దేవా చేశారు. ఏ జిల్లాకి పోయినా, ఏ నియాజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన పనులను తిరగతోడి.. కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదే విధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం వల్లే రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంతమంది ఎన్ని అవాంతరాలు సృష్టించినా, కుట్రలు చేసినా.. గ్రామ గ్రామాన పట్టుదలతో పనిచేసిన బీఆర్ఎస్ కుటుంబసభ్యులకు, పార్టీ కోసం దీక్షతో శ్రమించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.