- ఎన్నికల తర్వాత కనిపించని నేతలు
- చుట్టపుచూపుగా వస్తున్న మాజీమంత్రి పువ్వాడ
- పత్తాలేని మాజీ ఎంపీ నామా
- అయోమయంలో పార్టీ క్యాడర్
- ప్రెస్‌మీట్లకే పరిమితమైన నేతలు
ఖమ్మం, జనవరి 15 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖమ్మంలో బీఆర్‌ఎస్ పత్తా లేకుండా పోయింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చేసిన ముఖ్యనేతలు ఇప్పుడు జాడ లేకుండాపోయారు. దీంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. కేవలం జయంతి, వర్ధంతి సభలు నిర్వహించడం, ప్రెస్‌మీట్లు నిర్వహించి ఆరోపణలు చేయడం తప్పా, క్షేత్రస్థాయికి వెళ్లడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ హామీలపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేతలు తమకేం పట్టదన్నట్లు వ్యవహిరస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యనాయకులంతా అడపాదడపా ఖమ్మంలో జరిగే కార్యక్రమాలకు ప్రత్యక్షమై హడావుడి చేసి, వెళ్లిపోతున్నారు. తప్పిస్తే ఎక్కడా ఉద్యమాలు చేస్తూ ప్రజల మధ్య గడిపినట్లు కనిపించడం లేదు.
ఆధిపత్య పోరుతో నష్టపోతున్న వైనం
ఎమ్మెల్సీగా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాయకుడికి, మాజీమంత్రికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమమంటోంది. అధికారంలో ఉన్నప్పుడి నుంచే ఈ పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో మాజీమంత్రికి ఖమ్మం టిక్కెట్ ఇచ్చిన సందర్భంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆ నాయకుడు అడ్డుకున్నాడనే ప్రచారం జరిగింది. మాజీమంత్రికి మళ్లీ టిక్కెట్ ఇస్తే ఓడిపోవటం ఖాయమనే విషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరగడం, దానిపై మాజీమంత్రి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి నేటి వరకు ఇద్దరి నేతల మధ్య అదే పరిస్థితి నెలకొంది. ఆ కారణంతోనే మాజీమంత్రి ఖమ్మం వచ్చినా పార్టీ కార్యాలయానికి వెళ్లిన సందర్భాలు అరుదు. ఇద్దరి మధ్య నెలకొన్న ఈ పరిస్థితిని అధినాయత్వం నేటికీ చక్కదిద్దలేదు. ఇప్పటికైనా అధినాయకత్వం జోక్యం చేసుకొని, వీరి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీకి జిల్లాలో పూర్వవైభవం తీసుకురవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు.
శాసనసభలో ప్రాతినిధ్యం కరువు
గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఒక్క భద్రాచలం మినహా ఎక్కడా బీఆర్‌ఎస్ పార్టీ గెలవలేకపోయింది. ఆ తర్వాత ఉన్న ఒక్క సీటు కూడా చేయి జారిపోయింది. అక్కడి అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఖమ్మం నుంచి పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండాపోయింది. తాతా మధుసూదన్ ఒక్కరు మాత్రమే ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
‘నామ’మాత్రమేనా?
గత ఎన్నికల్లో సిట్టింగ్ పార్లమెంట్ స్థానాన్ని కూడా బీఆర్‌ఎస్ కోల్పోయింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నామ నాగేశ్వరరావు ఘోర ఓటమి చవిచూశారు. ఎంపీగా ఉన్నప్పుడే అడపాదడపా జిల్లాకు వచ్చే నామ, ఓడిపోయిన తర్వాత పూర్తిగా పత్తా లేకుండా పోయారనే విమర్శలున్నాయి. తాను ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటానన్న నామా.. ఓడిన తర్వాత మాట నిలుపుకోలేకపోయారు. సమస్యలు గురించి చెప్పుకుందామంటే ఆయన ఉనికి లేకుండాపోయింది. ఆయనింటి గేట్లు ఎప్పుడూ మూసే ఉంటున్నాయని, సమాధానం చెప్పే దిక్కులేకుండా
హైదరాబాద్‌కే పరిమితమైన మాజీమంత్రి
మంత్రిగా అయిదేండ్లు జిల్లాలో చక్రాధిపత్యం చెలాయించిన పువ్వాడ ఇప్పుడు జిల్లాలో జాడ లేకుండా పోయారు. హరీశ్‌రావు లాంటి ముఖ్య నేతలు ఖమ్మం వచ్చినప్పుడు మాత్రమే రావడం తప్ప, మామూలు సమయంలో ఖమ్మంలో ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఖమ్మం మున్నేరుకు వరదలు వచ్చినప్పుడు, హరీశ్‌రావు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించినప్పుడు, మరో రాష్ట్రస్థాయి నాయకుడు ఖమ్మం వచ్చినప్పుడు మాత్రమే మాజీమంత్రి ఖమ్మంలో వారితో కలిసి పర్యటించారు.
ఆ తర్వాత జిల్లాలో ఆయన ఉనికి కనిపించలేదు. హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడు ఖమ్మం వచ్చినప్పడు తన ఇంటికే అనుచరులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఆ మధ్య ఆయన నియోజకవర్గం మారుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్‌లోనే గడపటం వల్ల పార్టీ శ్రేణుల్లోనూ, ఆయన అనుచరుల్లోనూ నిర్లిప్తత నెలకొంది. నాయకులు సక్రమంగా పట్టించుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో ఎంతోమంది నాయకులు, కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయినా బీఆర్‌ఎస్ ముఖ్యనేతల్లో చలనం లేదు.