హైదరాబాద్,(విజయక్రాంతి): దిలావర్ పూర్ లో రైతుల దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. లగచర్లలో ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా గురుకుల బాట కార్యక్రమం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల పరిస్థతుల అధ్యయనానికి బీఆర్ఎస్ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కూడా కమిటీ ఉంటుందని, కమిటీ నివేదికలోని అంశాలను శాసనసభలో లేవనెత్తుతామని ఆయన వెల్లడించారు. రేవంత్ రెడ్డి సర్కార్ గురుకుల, పాఠశాలల విద్యను సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 52 మంది విద్యార్థులు మరణించగా, 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగినట్లు కేటీఆర్ వివర్శించారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడని, సీఎంకు ఢిల్లీ తిరిగేందుకు సమయం సరిపోవడంలేదన్నారు. విద్యార్థులు చనిపోతున్న కూడా రేవంత్ రెడ్డి ఒక సమీక్ష కూడా నిర్వహించలేదని కేటీఆర్ వివర్శించారు.