calender_icon.png 22 September, 2024 | 7:14 AM

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి దిలీప్ అరెస్ట్

06-09-2024 04:00:00 AM

  1. సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో కొణతం
  2. జైనూరు ఘటనపై పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు 
  3. పోలీసులతో బీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం

హైదరాబాద్ సిటీ బ్యూరో/హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం ఇన్‌చార్జి కొణతం దిలీప్ కుమార్‌ను గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దిలీప్‌గత ప్రభుత్వ హయంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఆదివాసీ మహిళకు జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్లు, దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా వరద సాయంపై ప్రశ్నించినందుకే దిలీప్‌ను అరెస్టు చేశారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఎలాంటి కారణాలు చెప్పకుండా ఇంటి నుంచి అకారణంగా తీసుకెళ్లారని పార్టీ నేతలు జగదీశ్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి తదితరులు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. దిలీప్ నిర్భందంపై ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్ నేతలకు వాగ్వాదం జరిగింది.  

ప్రశ్నించే గొంతు నొక్కేడమే ప్రజా పాలనా: కేటీఆర్ 

కొణతం దిలీప్‌ను అరెస్టు చేయడం అక్రమమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. కొంతకాలంగా ప్రశ్నించడంతో రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోయిందన్నారు. కొన్నిరోజుల క్రితం తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి రాలేదన్నారు. దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్ధేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్టు చేశారని మండిపడ్డారు.

ప్రశ్నించే వారి గొంతు నొక్కటమే ప్రజాపాలనా అంటూ నిలదీశారు. ఎన్ని కేసులు పెట్టినా, నిర్భందించినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు మరింత పుట్టుకొస్తారని పేర్కొన్నారు. దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దిలీప్ అరెస్ట్ అక్రమమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పోలీసుల మీద ఆధారపడి బతకాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.  తెలంగాణలో అప్రకటిత నిర్భందం కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిలీప్ అరెస్ట్‌ను ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, దేవీప్రసాద్ తదితరులు ఖండించారు.  

దిలీప్‌పై 196 బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ కుమార్‌ను గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు గిరిజన మహిళపై జరిగిన ఘటనపై వివాదాస్పద రీతిలో తెలుగు స్ర్కైబ్ అనే ఎక్స్ ఖాతాలో పోస్టులు చేశారని అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌పై 66 ఐటీయాక్ట్‌తో పాటు 196 బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.