calender_icon.png 19 November, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా హెడ్ కొణతం దిలీప్ అరెస్ట్

19-11-2024 01:58:52 AM

  1. మెడికల్ పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  2. రిమాండ్‌ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సోషల్ మీడియా హెడ్, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌కుమార్‌ను సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 31న జైనూరులో గిరిజన మహిళపై జరిగిన ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్‌లో పోస్టులు పెట్టారని అతన్ని సెప్టెంబర్ 5న అదుపులోకి తీసుకొని, పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

అనంతరం బెయిల్‌పై విడుదలైన దిలీప్‌ను హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం సీసీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం సైబర్ క్రైం పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టుకు తరలించారు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో మాసబ్‌ట్యాంక్‌లోని విజయ్‌నగర్ కాలనీలో ఉన్న జడ్జి ఇంటికి తీసుకెళ్లారు.

హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని దిలీప్ తరఫు న్యాయవాది కిరణ్ వాదనలు వినిపించారు. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించిన జడ్జి.. రిమాండ్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలిచ్చారు. కాగా దిలీప్ అరెస్ట్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి వ్యతిరేకించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సంకేళ్లు వేస్తారా అంటూ ప్రశ్నించారు.