calender_icon.png 14 February, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్ట్

02-05-2024 01:41:35 AM

ఓయూ సెలవులపై దుష్ప్రచారం చేశారని.. 

పంతంగి టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే1 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మన్నె క్రిశాంక్, ఓయూ విద్యార్థి నేత నాగేందర్‌ను ఓయూ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూని వర్సిటీ హాస్టల్స్‌కు సెలవులు ప్రకటించడాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచా రం చేశారనే ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్‌జోన్ డీసీపీ గిరిధర్ పేర్కొన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా యూనివర్సిటీ హాస్టల్స్‌కు అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. కాగా, సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను వక్రీకరిస్తూ క్రిశాంక్, నాగేందర్ తప్పుడు పోస్టులు పెట్టారని, యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీశారని క్రిశాంక్, నాగేందర్‌పై ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాద్  విజయవాడ జాతీయ రహదారిలోని పంతంగి టోల్‌గేట్ వద్ద క్రిశాంక్, నాగేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు క్రిశాంక్‌పై 207/ 2024 ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసి, ఐపీసీ 469, 465, 471, 505 (1) (b), (c) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు  జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం క్రిశాంక్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

అరెస్టును ఖండించిన కేటీఆర్

క్రిశాంక్ అరెస్టును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఖండించారు. క్రిశాంక్ అంటే ఒక ఉద్యమ గొంతుక, ఒక చైతన్య ప్రతీక, యువతరానికి ప్రతిబింబం అని కొనియాడారు. ఇటు గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలు.. అటు ఢిల్లీ బీజేపీ ఆరాచకాలపై గళమెత్తినందుకే క్రిశాంక్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఈ నియంతృత్వ, నిర్బంధ విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.  

కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసుల తీరు: మాజీమంత్రి జగదీశ్ రెడ్డి 

బీఆర్‌ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసులు ఆ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బూట్లు తుడుస్తున్న మంత్రులు జైళ్లు అనే పదం వాడకుండా పరిపాలన చేయలేకపోతున్నారని విమర్శించారు.