14-04-2025 12:06:03 AM
మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల, ఏప్రిల్ 13: ఈ నెల 27న వరంగల్లో బీఆర్‌ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగ జరుపుకోనున్నామని, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని స్టార్ ఫంక్షన్ హాల్ లో పార్టీ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్స సభ సన్నాహక సమావేశానికి ఆమె మఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించడమే కాదు 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ను పట్టుకొని ఏం చేశారని కొందరు మాట్లాడుతు న్నారని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలన ఎట్లుందో... ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లి అడిగినా తెలుస్తుంది. ఏడాది నుంచి ఎవరిని కదిలించినా కేసీఆర్ ను ఓడగొట్టుకుని తప్పు చేశామని అంటున్నారని, రాష్ట్రంలో కేసీఆర్ చేసిన పనులు తప్ప కొత్తగా ఏమీ కనిపించడం లేదన్నారు.
రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి రెండు విడతల రైతుబంధు ఎగ్గొట్టాడని, కేసీఆర్ ఉంటే సమయానికి డబ్బులు వేసేవాడని ప్రతి రైతు గుర్తుచేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పేరు చెరిపేస్తామని మాట్లాడుతున్నాడని... అది ఎవరి తరం కాదన్నారు. మిషన్ భగీరథ నీటిని తాగినా, ఊర్లలో కనిపించే హరితహారం చెట్లను చూసినా కేసీఆర్ కనిపిస్తాడని స్పష్టం చేశారు.
27న వరంగల్ జరగబోయే సభకు ఇంట్లో పండుగకు పిలిచినట్లుగా ఊరిలో ప్రతి ఒక్కరికి పిలవాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు, యువత, కేసీఆర్ అభిమానులు మండలం, గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టుకోని... ప్లాన్ రెడీ చేసుకోవాలని కోరారు. ప్రతి బస్సుకు ఆయా గ్రామాలకు సంబంధించిన పేర్లతో ప్లెక్సీ ఏర్పాటు చేసుకుని, దానిపై బస్సు డ్రైవర్ ఫోన్ నంబర్ రాయించాలని సూచించారు. ఉదయం ప్రతి గ్రామంలో పార్టీ జెండావిష్కరణ చేసి...
ర్యాలీగా బస్సుల్లో ఎక్కి సభకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఏస్ చైర్మన్ పట్లొళ్ల కృ ష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, తెలంగాణ ఉద్యమకారుడు దేశమోళ్ల ఆంజనేయులు, కనీస వేతనాల మాజీ చైర్మన్ నారాయ ణ, శంకర్పల్లి, మొయినాబాద్ మాజీ ఎంపీపీలు గోవర్దన్ రెడ్డి, జయవంత్, మండలాల పార్టీ అధ్యక్షులు గూడూరు నర్సింగ రావు, పెద్దొళ్ల ప్రభాకర్, గోవర్దన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ వంగ శ్రీధర్ రెడ్డి, నేతలు గోనె కరుణాకర్ రెడ్డి, శేరి రాజు తదితరులు పాల్గొన్నారు.