ఆదిలాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్(BRS) పార్టీ సీనియర్ నేత, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ రోకండ్ల రమేష్(Former MPP Rokandla Ramesh) గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందారు. టీడీపీ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోకండ్ల రమేష్ జైనథ్ మండలం ఎంపీపీగా పనిచేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ(Telangana Movement) సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న(Former Minister Joggu Ramanna), పార్టీ నేతలు రోకండ్ల రమేష్ మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రోకండ్ల రమేష్ అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. రోకండ్ల రమేష్ మృతి పట్ల ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి తమ సంతాపాన్ని ప్రకటించారు.