calender_icon.png 21 October, 2024 | 12:31 AM

రైతు భరోసా లేదంటూ ప్రకటన.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు

20-10-2024 03:38:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఈ వానకాలం రైతు భరోసా లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసి ప్రకటనపౌ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, రైతన్నలు నిరసనలు కొనసాగిస్తున్నారు.  ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని మాయ మాటలు చెప్పి, అధికారంలో వచ్చాక, రైతు భరోసాను పక్కనబెట్టి రోజుకో మాట మాట్టాడుతూ రైతులను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ పభుత్వం శవ యాత్రను ఊరేగింపు నిర్వహించి చౌరస్తాల్లో దగ్ధం చేశారు.

రైతు భరోసా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు.  షాద్ నగర్ పట్టణ కేంద్రంలోనీ మండల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఎకరానికి రూ 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది, కానీ, అధికారంలోకి రాగానే వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిందన్నారు.  కాగా, నాగార్జునసాగర్, ఆర్మూర్ నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తుంటే కొన్ని చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. మరీ కొన్ని కేంద్రాలలో దగ్ధం చేసిన అనంతరం ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.

నిజామాబాద్ రూరల్ డిచ్ పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిష్టి బొమ్మ దహనం చేశారు. కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే రైతాంగానికి క్షమాపణ చెప్పి, వారి వైఫల్యాలకు నైతిక బాధ్యత వహించాలన్నారు. అనంతరం తక్షణమే వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.